Actor Chandra Mohan Demise :చూడగానే ఆకట్టుకునే రూపం, నటనలో మంచి ఈస్ చక్కని అభినయం దానికి తగ్గ వాచకం..ఇలాంటి ఎన్నో లక్షణాలున్న చంద్రమోహన్ పరిశ్రమలో నిలదొక్కుకోడానికి పెద్ద సమయం పట్టలేదు. తొలి సినిమా 'రంగుల రాట్నం' జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తే, 'సుఖ దుఃఖాలు' నటుడిగా తానంటే ఏంటో నిరూపించింది. ఆ తర్వాత అరవైయేళ్లకు సాగిన నట ప్రయాణంలో 600కు పైనే చిత్రాలు చేశారు. వాటిలోని ప్రతి పాటలో ప్రత్యేకమైన నటనతో అలరించారు.
చంద్రమోహన్ కథానాయకుడిగా నటించిన 'బంగారు పిచ్చుక'... ఆయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. 'ఇంట్లో పంజరం'లో ఇరుక్కోలేక బయటపడదామని ప్రయత్నించి ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొనే వ్యక్తిగా చంద్రమోహన్ నటన నవ్విస్తూనే ఓ మంచి అనుభూతిని పంచుతుంది. ఇక 'బొమ్మా బొరుసా' సినిమాలో కాస్త రెబెల్‌గా కనిపించే చంద్రమోహన్ కోటి పెట్టుకుని జీవితాన్ని నెగ్గుకొచ్చే పాత్రలో ఈ తరం కథానాయకుడిని మరిపిస్తాడు. 'సంపూర్ణ రామాయణం' సినిమాలో భరతునిగా చంద్రమోహన్ నటన.. సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. రాముడిని అడవికి పంపినప్పుడు తల్లి కైకను నిలదీసే పాత్రలో చంద్రమోహన్ భరతుడిగా ఒదిగిపోయారు. భరతుడు నిజంగానే కైకను ఇంతలా నిలదీశారా అని అనిపించక మానదు.
'యశోద కృష్ణ' సినిమాలో నారదుని పాత్రలో మెప్పించిన చంద్రమోహన్ అక్కినేని, రేలంగి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కాంతారావు లాంటి వారెందరో నటించిన ఆ పాత్రకు తనదైన రీతిలో న్యాయం చేశారు. ఇక 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో కథానాయకుడి తర్వాత అంత ముఖ్యమైన పాత్ర చేసిన చంద్రమోహన్ దేశభక్తి, వీరత్వం కలగలిసిన పాత్రలో సీతారామరాజు ఆశయ సాధన కోసం జీవితాన్నే పణంగా పెట్టిన దేశభక్తుడిగా.. అద్భుతమైన నటన ప్రదర్శించారు.
Actor Chandra Mohan Movies : చంద్రమోహన్, జయప్రద కాంబినేషన్‌లో వచ్చిన 'సిరిసిరిమువ్వ'లో కథానాయికకు అండగా నిలిచే వ్యక్తిగా..కళాకారుడిగా, 'సీతామాలక్ష్మి' సినిమాలో కథానాయికను సినిమా తారగా మార్చేందుకు కష్టపడే వ్యక్తిగా.. ఏమీ ఆశించకుండ సహాయం చేసే మంచి మనిషిగా.. చంద్రమోహన్ నటన ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటుంది. 'పదహారేళ్ల వయసు' సినిమాలో చంద్రమోహన్ నటనకు ఎన్ని మార్కులు వేసిన తక్కువే. అవిటితనం గల పాత్రలో అమాయకుడైన పల్లెటూరి యువకుడిగా నటించాడనే కంటే జీవించాడంటే సరిపోతుంది.
'శంకరాభరణం' నుంచి చంద్రమోహన్ కామెడీ కథానాయకుడిగా మారిపోయారు. ఈ సినిమాలో శంకర శాస్త్రి కూతురిని పెళ్లి చూపులు చూడటానికి వచ్చినప్పుడు చంద్రమోహన్ నటన ప్రతి ఒక్కరికి చక్కిలిగింతలు పెడుతుంది. 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి చంద్రమోహన్ వండి వార్చిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. నటుడికి కావాల్సింది పాత్ర మాత్రమే అని నమ్మే చంద్రమోహన్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలరని చెప్పడానికి ఈ సినిమానే ఉదాహరణ.
ఇదే కోవలోకొచ్చిన 'వివాహ భోజనంబు' చంద్రమోహన్‌లోని పూర్తిస్థాయి నటుడ్ని వెండితెరపై ఆవిష్కరించింది. ప్రేమించిన అమ్మాయి కోసం రకరకాల త్యాగాలు చేసే యువకుడిగా అవసరం కోసం మాత్రమే మోసం చేసే వ్యక్తిగా చంద్రమోహన్ నటన సగటు యువకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తుంది. విజయశాంతి కథానాయికగా తెరకెక్కిన 'పెళ్లి చేసి చూపిస్తాం' సినిమాలో భార్యకు కండీషన్‌లు పెట్టే భర్తగా అబద్ధం ఆడి పెళ్లి చేస్తే అల్లుడి నుంచి వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపే అల్లుడిగా చంద్రమోహన్.. పాత్రలో ఒదిగిపోయారు.