తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి సుబ్రమణియం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
అజిత్ తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్వక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు. అజిత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం చెన్నైలో బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో అజిత్ తండ్రి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.
విషయం తెలిసిన వెంటనే!
అజిత్, ఆయన భార్య శాలిని ఇతర కుటుంబ సభ్యులు ఐరోపాలోలో ఉన్నారు. కొన్నిరోజుల క్రితం ఫ్యామిలీ టూర్ వేశారు. అయితే తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే ఇండియాకు ప్రయాణం అయ్యారు. గురువారం మధ్యాహ్నం లోపు అజిత్ చేరుకోవచ్చని తెలుస్తోంది.
సుబ్రమణియం వయసు 84 ఏళ్లు. ఆయన స్వస్థలం కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్. ఆయనకు భార్య మోహిని, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురిలో అజిత్ కుమార్ హీరో కాగా.. మరో ఇద్దరి పేర్లు అనూప్ కుమార్, అనిల్ కుమార్. కొన్నిరోజులు అజిత్ ఫ్యామిలీ హైదరాబాద్ సిటీలో కూడా ఉన్నారు.
అజిత్ సినిమాలకు వస్తే.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేయాలని అజిత్ కుమార్ ప్లాన్ చేశారు. అయితే, ఆ సినిమా మధ్యలో ఆగింది. దాన్ని పక్కన పెట్టేశారు. విఘ్నేష్ శివన్ బదులు 'కలగ తలైవన్' దర్శకుడు తిరుమేనితో సినిమా చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఆ సినిమా ప్రొడ్యూస్ చేయనుంది.
బాలీవుడ్‌లోనూ విషాదం..
బాలీవుడ్‌లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖదర్శకుడు ప్రదీప్ సర్కార్(68) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆయన.. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు.
పరిణీత, లగా చునారి మే దాగ్ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. పరిణీత చిత్రానికి ఆయన నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆయన చివరగా 2020లో విడుదలైన దురంగ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ముంబయిలోని శాంతాక్రూజ్ శ్మశానవాటికలో ప్రదీప్ అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు.