ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 సినిమా చేస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సినిమాను నందమూరి కల్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాకు పని చేసిన స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ ఎన్టీఆర్ 30 సినిమాకు పని చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆయన తెలుగులో 'సాహో' చిత్రానికి కూడా పని చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కెన్నీ బేట్స్ డిస్కస్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటో చూస్తే.. షిప్లో సూపర్ ఫైట్ గ్యారెంటీ అని తెలుస్తోంది. సినిమాలో మెజారిటీ ఫైట్స్ ఆయనే చేస్తారని చిత్ర బృందం తెలిపింది.
ఎన్టీఆర్ 30 సినిమా లాంఛింగ్ ఈవెంట్లో కథ, హీరో క్యారెక్టర్ గురించి కొరటాల శివ చెప్పేశారు. ''అనగనగా సముద్ర తీర ప్రాంతం! మనం మర్చిపోయిన భూభాగం! ఆ ప్రాంతంలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటాయి. భయం అంటే ఏమిటో తెలియని మృగాలు అవి. దేవుడు అంటే భయం లేదు. చావు అన్నా భయం లేదు. కానీ, ఒక్కటి అంటే భయం. ఆ భయం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఇదీ కథా నేపథ్యం'' అని కొరటాల చెప్పారు. ''భయం ఉండాలి, భయం అవసరం కూడా! భయపెట్టడానికి సినిమాలో ప్రధాన పాత్ర (హీరో) ఏ స్థాయికి వెళతాడనేది ఎమోషనల్ రైడ్. ఇది నా బెస్ట్ సినిమా అని ప్రామిస్ చేస్తున్నాను'' అని కొరటాల శివ వివరించారు.
'అజ్ఞాతవాసి', 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' సినిమాల తర్వాత అనిరుధ్ రవిచందర్ తెలుగులో ఎన్టీఆర్ 30కు తన బాణీలు అందించనున్నారు. సినిమా ప్రారంభోత్సవంలో అనిరుధ్ కూడా మాట్లాడారు. ''ఏడాది క్రితం దర్శకుడు కొరటాల శివ గారిని కలిశాను. ఎప్పుడు కలిసినా ఓ మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆయన ఊహలో నేను ఓ భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన ఊహ భారీగా ఉంటుంది. ప్రాణం పోయగలనని అనుకుంటున్నాను. ఈ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఇచ్చిన శివ గారికి, తారక్ గారికి థాంక్స్.. నేను తిరిగి వస్తున్నాను'' అని చెప్పారు.