Acharya Promotions: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్న 'ఆచార్య'.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న ప్రేక్షకుల మందుకు రానుంది. కొరటాల- మెగాస్టార్ కాంబినేషన్ కావడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పాటలు, ట్రైలర్ అదిరిపోయినందున.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల మెగా అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా గడుపుతోంది. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. 'చిరుత' నుంచి 'ఆచార్య' వరకు చరణ్లో గమనించిన తేడా ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చిరు సమాధానమిచ్చారు.
"మొదటి నుంచి నాకెప్పుడు చరణ్ ఏ విషయంలో తప్పు చేస్తున్నాడని అనిపించలేదు. బహుశా నా కన్న బిడ్డ కనుక అతడిపై ఉన్న ప్రేమ కవర్ చేస్తుందేమో. అయితే బయట వాళ్లు ఏం అనుకుంటున్నారని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ అందరూ చరణ్ బాగా నటిస్తున్నాడని చెప్పేవారు. ఏ హీరో అయినా మొదటి చిత్రం నుంచే అద్భుతంగా నటిస్తే.. అతడి ఒకటి రెండు సినిమాలు అయ్యాక ఓవర్ అనిపిస్తుంది. ఇక, మొదటి చిత్రం నుంచి చరణ్ అన్ని విషయాల్లో అంచెలంచెలుగా డెవలప్ అయ్యాడు." -మెగాస్టార్ చిరంజీవి