తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రముఖ బాలీవుడ్​ నటుడే లక్ష్యంగా ముంబయిలో రెక్కీ..!

బాలీవుడ్ నటుడు సల్మాన్​ ఖాన్​ను చంపేస్తామంటూ​ కొందరూ లేఖ రాశారు. ఇదివరకే సిద్ధూ మూసేవాలాను హత్య చేసిన నిందితులు.. అనంతరం సల్మాన్​కు లేఖ పంపించారు. లేఖలో ఏం చెప్పారంటే..

Salman Khan
Accused in Sidhu Moose Wala murder case conducted recce in Mumbai to target Salman Khan

By

Published : Sep 11, 2022, 8:20 PM IST

పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడ్డ నిందితులు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ లక్ష్యంగా ముంబయిలో రెక్కీ నిర్వహించినట్లు పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ ఆదివారం వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సూచనల మేరకే ఈ రెక్కీ జరిగినట్లు తెలిపారు.
మూసేవాలా హత్య అనంతరం అదే రీతిలో చంపేస్తామంటూ కొందరు ఆగంతకులు ఓ లేఖలో సల్మాన్‌ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను బెదిరించారు. కాగా ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌ డీజీపీ మాట్లాడారు. 'మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన కపిల్‌ పండిట్‌ను విచారించగా.. లారెన్స్‌ బిష్ణోయ్‌ సూచనల మేరకు సల్మాన్‌ ఖాన్‌ లక్ష్యంగా మరో ఇద్దరితో కలిసి రెక్కీ నిర్వహించినట్లు ఒప్పుకున్నాడు. ఆ ఇద్దరిని కూడా విచారిస్తాం' అని పేర్కొన్నారు. సల్మాన్‌ను టార్గెట్‌ చేసేందుకు సంపత్‌ నెహ్రాతో ప్లాన్‌ చేశారని డీజీపీ వెల్లడించారు.

సిద్ధూ మూసేవాలా హత్య కేసులో మొత్తంగా 23మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు. 'ఇప్పటివరకు మొత్తంగా 23 మందిని అరెస్టు చేశాం. ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. మొత్తంగా 35మంది నిందితులను గుర్తించాం' అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మూసేవాలాపై కాల్పులకు పాల్పడిన ఆరుగురు ప్రధాన నిందితుల్లో పరారీలో ఉన్న ఆఖరు వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను దిల్లీ పోలీసులు గతంలోనే అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరిని పంజాబ్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న దీపక్‌ ముండీ, అతని ఇద్దరు సహచరులు కపిల్‌ పండిట్‌, రాజిందర్‌లను పశ్చిమ బెంగాల్‌- నేపాల్‌ సరిహద్దులో పట్టుకున్నట్లు పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details