కార్తికేయ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'బెదురులంక 2012'. నేహాశెట్టి కథానాయిక. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మాత. సి.యువరాజ్ సమర్పిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ని కథానాయకుడు నాని బుధవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "ఒక పల్లెటూరి నేపథ్యంలో జరిగే కథ ఇది. 2012లో యుగాంతం ఖాయం అంటూ సాగిన ప్రచారం ఈ కథలో కీలకాంశం. ప్రేక్షకుల్ని బెదురులంక అనే ఓ కొత్త ప్రపంచంలోకి సినిమా తీసుకెళుతుంది. కాకినాడ, యానాం, గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం"అన్నారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "బలమైన కథతోపాటు కడుపుబ్బా నవ్వించే వినోదం ఉన్న చిత్రమిది" అని అన్నారు.
తండ్రీ తనయుల కథ
శాంతి చంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రం 'డర్టీ ఫెలో'. దీపిక సింగ్, శిమ్రితి బతీజా, నిక్కీషా రంగ్‌వాలా కథానాయికలు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్నారు. జి.ఎస్.బాబు నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో టైటిల్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథిగా హాజరై లుక్‌ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ప్రేక్షకులకు చేరువయ్యేలా ఉంది ఈ పేరు. నటులు, చిత్రబృందం సినిమా కోసం తపనతో పనిచేశారు" అని అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ "తండ్రి, తనయుల కథ ఇది. సమాజానికి హానికరంగా మారిన తనయుడి విషయంలో ఓ తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆసక్తికరం"అన్నారు. "కథానాయకుడు శాంతిచంద్ర, సంగీత దర్శకుడు డా.సతీష్‌ల సహకారంతో ఈ సినిమాని అనుకున్నట్టుగా పూర్తి చేశాం"అన్నారు.
ఆర్థిక నేరాల చుట్టూ...
సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్ ప్రధాన పాత్రధారులుగా... పాన్ ఇండియా స్థాయిలో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రియ భవానీ శంకర్, సత్య అకల, సునీల్ వర్మ, జెనిఫర్ పిచినెటో ముఖ్య పాత్రలు పోషించారు. 'పెంగ్విన్'ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎన్.రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. పేరు ఖరారు కాని ఈ సినిమా చిత్రీకరణ తొలి షెడ్యూల్ పూర్తయింది. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. "భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి".
"నాణ్యమైన చిత్రాల్ని అందించడం కోసం చెన్నై, హైదరాబాద్ నగరాలకి చెందిన మా రెండు నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఆర్థిక నేరాల చుట్టూ సాగే ఈ కథ ప్రేక్షకులకి థ్రిల్‌ని పంచుతుంది. తెలుగు, కన్నడ, తమిళంతోపాటు, హిందీ, మలయాళం భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేస్తాము" అని నిర్మాతలు తెలిపారు.
ప్రతీకార ఆక్రోశం
అరుణ్ విజయ్ కథానాయకుడిగా... జి.ఎన్.ఆర్.కుమారవేలన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆక్రోశం'. పల్లక్ లల్వాని కథానాయిక. సీహెచ్ సతీష్‌కుమార్‌తో కలిసి ఆర్.విజయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ "ప్రతీకారం నేథ్యంలో యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుగా రూపొందిన చిత్రమిది.తమిళంలో 'సినం'పేరుతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి విభిన్నమైన కథల్ని తప్పక ఆదరిస్తారు. అరుణ్ విజయ్ నటించిన 'ఏనుగు'చిత్రాన్ని మేమే విడుదల చేశాం. మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంది"అన్నారు.
అరుణ్ విజయ్,పల్లక్ లల్వాని టాప్‌గన్: మేవరిక్ మళ్లీ థియేటర్లలో
ట్రామ్‌క్రూజ్ నుంచి హిట్ చిత్రం 'టాప్‌గన్: మేవరిక్'మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించనుంది. వేసవి కానుకగా వచ్చి భారీ వసూళ్లు అందుకుందీ చిత్రం. 'పారామౌంట్' సంస్థలో భారీ వసూళ్లు అందుకున్న చిత్రాల్లో ముందు వరసలో నిలిచింది. ప్రేక్షకులకు మరోసారి వినోదాన్ని పంచడానికి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 2 నుంచి 15 వరకూ ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. ఎందుకంటే 16 నుంచి అవతార్: ది వే ఆఫ్ వాటర్ హంగామా మొదలుకాబోతుంది.
తమిళ 'కేడీ' రీమేక్‌లో అభిషేక్‌బచ్చన్?
తమిళ చిత్రం 'కేడీ' ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ పురస్కారాలను సైతం ఈ చిత్రం గెలుచుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట ప్రముఖ దర్శకనిర్మాత నిఖిల్ అద్వానీ. ఇందులో హిందీ కథానాయకుడు అభిషేక్‌బచ్చన్ నటినున్నట్లు సమాచారం.
మాతృకకు దర్శకత్వం వహించిన మధుమిత సుందరరామన్ హిందీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయని, జనవరిలో భోపాలలో చిత్రీకరణ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఓ పెద్దాయన, ఓ ఎనిమిదేళ్ల కుర్రాడి నేపథ్యంలో సాగే కథే 'కేడీ'. ఇందులో వృద్ధుడి పాత్రలోనే అభిషేక్ నటించనున్నారట.
వారసుడితో వయ్యారి