Aamir Khan Shocking Decision: నెరిసిన గడ్డం, తెల్లజుట్టుతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు స్టార్ హీరో ఆమిర్ ఖాన్. లాల్‌సింగ్ చడ్డా ఫెయిల్యూర్ తర్వాత తొలిసారి ఓ ఈవెంట్‌లో ప్రత్యక్షమయ్యారాయన. తన చిన్ననాటి స్నేహితులు నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా సినిమాలు మానేస్తున్నట్లు ప్రకటించారు.
ఏదో కోల్పోతున్నట్లు అనిపిస్తోంది.. ఇక సినిమాలు చేయను!: ఆమిర్ ఖాన్ అనూహ్య నిర్ణయం - Aamir Khan lalsingh chadda
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలికంగా సినిమాల్లో నటించడం మానేస్తున్నట్లు ప్రకటించారు.
"ఒక నటుడిగా ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్ వస్తోంది. నిజానికి లాల్‌సింగ్ చడ్డా తర్వాత ఛాంపియన్స్ మూవీ చేయాల్సి ఉంది. ఇది ఓ అద్భుతమైన కథ. కానీ ఆ సినిమా చేయాలని లేదు. ముందు నాకు విశ్రాంతి కావాలనిపిస్తోంది. నా తల్లితో, పిల్లలతో, కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలనుంది. 35 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నా. నిరంతరం పని గురించే ఆలోచించాను. కానీ అది కరెక్ట్ కాదనిపిస్తోంది. నాకు దగ్గరైన మనుషుల గురించి కూడా ఆలోచించాల్సింది. వారితో కలిసి జీవితాన్ని మరో యాంగిల్‌లో చూసేందుకు ఇదే సరైన సమయం అనిపిస్తోంది. కాబట్టి మరో ఏడాదిన్నరదాకా నటుడిగా కెమెరా ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు" అని తేల్చి చెప్పారు ఆమిర్.
'మరి ఛాంపియన్స్ సినిమా సంగతి ఏంటంటారు?' అన్న ప్రశ్నకు ఆమిర్ స్పందిస్తూ.. "నిర్మాతగా నేను నా పనులు నిర్వర్తిస్తూనే ఉంటాను. కాబట్టి నటుడిగా కాకపోయినా ఛాంపియన్స్‌కు నేను నిర్మాతగా ఉంటాను. వేరే యాక్టర్‌ను లీడ్ రోల్ చేయమంటాను. అంతా సవ్యంగానే జరుగుతుందని భావిస్తున్నా. ప్రస్తుతానికైతే నేను నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలి" అని చెప్పుకొచ్చారు.