గత కొంతకాలంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆయన భార్య ఆలియా సిద్దిఖీ మధ్య విడాకుల కేసు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి నవాజుద్దీన్ ఆయన కుటుంబంపై ఆలియా తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఏడు రోజులుగా తనకు సరిగ్గా ఆహారం ఇవ్వట్లేదని, పడుకోవడానికి బెడ్, అలాగే బాత్రూమ్కు కూడా వెళ్లనివ్వకుండా వేధిస్తున్నారని ఆలియా తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
నా భర్త బాత్రూమ్కు కూడా వెళ్లనివ్వడంలేదు: స్టార్ యాక్టర్ భార్య - నవాజుద్దీన్ కుటుంబంపై న్యాయవాది స్టేట్మెంట్
తన భర్త ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆలియా సిద్దిఖీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. గత వారం రోజులుగా తనకు ఆహారం, నిద్ర తదితర విషయాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ అతడి కుటుంబ సభ్యులు ఆలియా సిద్ధిఖీని ఇంటి నుంచి పంపించేందుకు కుట్రలు చేస్తున్నారని.. ఇందులో భాగంగా ఆమెపై అక్రమాస్తుల నేరారోపణ నిందను కూడా మోపారని లాయర్ తెలిపారు. అలాగే పోలీసుల ద్వారా ఆమెను అరెస్టు చేయిస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు కూడా నవాజుద్దీన్కే సహకరిస్తున్నారని లాయర్ ఆరోపించారు. అయితే ఆలియాను ఎవరూ కలవకుండా ఆమె చుట్టు కట్టుదిట్టమైన భద్రతతో పాటు సీసీటీవీలను కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే తన భర్త నవాజూద్దీన్తో బేధాభిప్రాయాలు ఉన్నాయని.. దీంతో పాటు అతడి కుటుంబం తనపై గృహహింసకు పాల్పడుతోందని.. అందుకే తనకు విడాకులు ఇప్పించాలని 2020 మే7న కోర్టును ఆలియా ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆలియా 2009లో నవాజుద్దీన్ సిద్ధిఖీని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు యాని, కుమార్తె షోరా ఇద్దరు సంతానం. ప్రస్తుతం ఆలియా ముంబయి అంధేరిలోని నవాజుద్దీన్ ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాగా, నవాజుద్దీన్ గతంలో షీబా అనే మహిళను వివాహమాడి ఆమె నుంచి విడిపోయి ఆలియాను రెండో వివాహం చేసుకున్నారు.