సినిమా షూటింగ్‌లో విషాదం జరిగింది. చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా ఓ స్టంట్ మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణం నిలవలేదు. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'విడుతలై'. ఇందులో ప్రముఖ తమిళ హాస్య నటుడు సూరి హీరోగా నటిస్తున్నారు. మరో ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది.
ట్రైన్ యాక్సిడెంట్ నేపథ్యంలో యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా పడిపోయిన ట్రైన్ మీద నుంచి ప్రయాణికులు పరుగులు తీసే సన్నివేశాలు తీస్తున్నారు. ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఎన్ సురేష్ అనే స్టంట్ మాస్టర్ బాడీకి కట్టిన రోప్ తెగడంతో ప్రమాదం జరిగింది. కింద పడిన సురేష్‌ను హుటాహటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రాణం దక్కలేదు. సురేశ్‌తో పాటు గాయపడిన మరో స్టంట్ మాస్టర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.