తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నన్ను వారంతా కిడ్నాపర్​ అనుకొని'.. స్టార్​ డైరెక్టర్​ కామెంట్స్​ - 7 డేస్ 6 నైట్స్​ డైరెక్టర్ ఎంఎస్ రాజు

7 Days 6 Nights Director MS Raju: సుమంత్ అశ్విన్‌, మెహర్‌ చాహల్, రోహన్‌, కృతికా శెట్టి ప్రధాన పాత్రలుగా రూపొందించిన చిత్రం '7 డేస్‌ 6 నైట్స్‌'. జూన్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన చిత్ర దర్శకుడు ఎం. ఎస్‌. రాజు చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సినిమా రూపొందించడానికి స్ఫూర్తి ఏంటి? పాత్రలను ఎలా సృష్టించారు? తన తదుపరి చిత్రాలు ఏంటి? వంటి సంగతులను చెప్పుకొచ్చారు. అవన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...

7 Days 6 Nights msraju
7 డేస్​ 6 నైట్స్ ఎంఎస్​ రాజు

By

Published : Jun 23, 2022, 7:18 AM IST

7 Days 6 Nights Director MS Raju: "ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది తాము అలసిపోయామనీ, విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. నాలో మాత్రం రోజురోజుకీ ఉత్సాహం పెరుగుతోంది. ఆ తపనతోనే ఈ సినిమా తీశా" అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత ఎం.ఎస్‌.రాజు. 'డర్టీ హరి'తో నవతరాన్ని మెప్పించిన ఆయన ఇటీవల దర్శకత్వం వహించిన చిత్రమే
'7 డేస్‌ 6 నైట్స్‌'. సుమంత్‌ అశ్విన్‌, రోహన్‌ కథా నాయకులుగా నటించారు. చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఎం.ఎస్‌.రాజు విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

"తొలిరోజు థియేటర్లకి వచ్చేది యువతరమే. ఆ తర్వాత కుటుంబ ప్రేక్షకులొస్తారు. నిన్నటిలో ఉండిపోకుండా, రేపటితరం సినిమాల్ని తీసినప్పుడే యువతరాన్ని మెప్పించగలం. నా ఆలోచనలు ఎప్పుడూ అదే తరహాలోనే ఉంటాయి. 'డర్టీహరి' తర్వాత కథల గురించి ఆలోచిస్తున్నప్పుడు రాజ్‌కపూర్‌ 'బర్సాత్‌' చూశా. అందులో రెండు ప్రధాన పాత్రలు బాగా నచ్చాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఓ కొత్తతరం కథ సిద్ధం చేయాలనుకున్నా. అలా మొదలైందే ఈ సినిమా ప్రయాణం.
సంక్లిష్టతతో కూడిన ఓ కథని రాశా. మరీ యువ ఆలోచనలతో కూడిన ఈ సినిమాకి ఎలాంటి సన్నివేశాలు, సంభాషణలు రాయాలి? నేనేమో యువకుడిని కాదు. అందుకే ఈ ప్రశ్న మొదలవగానే ఇంట్లో చెప్పకుండా ఒక్కడినే కార్‌ డ్రైవ్‌ చేసుకుంటూ గోవా బయల్దేరా. ఐదారు రోజలు అంతా తిరిగా. గోవాలో భిన్న ప్రాంతాలకి చెందిన యువతరం కనిపిస్తారు. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎలా నడుచుకుంటున్నారో గమనించా. కొన్ని సమూహాల్ని నేను అనుసరిస్తున్నప్పుడు కిడ్నాప్‌ చేయడానికి వచ్చాడా ఏంటి? అన్నట్టుగా అనుమానంగా చూశారు (నవ్వుతూ). ఇలాంటి రేపటితరం సినిమాలు చేస్తున్నప్పుడు ఈ రకమైన పరిశోధన చాలా అవసరం.

మా అబ్బాయి సుమంత్‌ అశ్విన్‌కి విజయాన్ని ఇవ్వడం కోసమే అనుకుంటే తనతోనే 'డర్టీహరి' సినిమా తీసేవాణ్ని. ఏ పాత్రకి ఎవరు సరిపోతారో వాళ్లతోనే సినిమా తీయాలనుకునే రకం నేను. తనకి తగ్గట్టుగా భావోద్వేగాలతో కూడిన పాత్ర కాబట్టే సుమంత్‌ అశ్విన్‌ని ఇందులో తీసుకున్నా. దానికి తగ్గట్టుగా సుమంత్‌ అశ్విన్‌ గడ్డం పెంచి, బరువు పెరిగి కెమెరా ముందుకొచ్చాడు. మరో పాత్రలో రోహన్‌ కనిపిస్తాడు. తన పాత్ర సరదా సరదాగా సాగుతుంది. కథానాయికల పాత్రలు కూడా బలంగా ఉంటాయి. మేం సెట్లో తండ్రీ కొడుకుల్లా కాకుండా హీరో, దర్శకుడిలాగే ప్రొఫెషనల్‌గా ఉంటాం. తొలి సినిమా సమయంలో కాస్త ఇబ్బంది పడ్డాడు తప్పిస్తే సెట్లో చాలా సౌకర్యంగా పనిచేస్తుంటా. తను సినిమా ప్రపంచంలోనే పుట్టి పెరిగినవాడు కాబట్టి సమస్యేమీ రాలేదు.అసభ్యంగా సాగే సినిమాలకీ, రొమాంటిక్‌ చిత్రాలకీ మధ్య ఓ చిన్న గీత ఉంటుంది. దాన్ని తెలుసుకునే ప్రయాణం చేస్తున్నా. తదుపరి రాజమండ్రి నేపథ్యంలో సాగే భార్యాభర్తల కథతో ఓ సినిమా తీస్తున్నా. మిస్టరీ కథతో సాగే సినిమా అది. ఆ తర్వాత నేను నిర్మించిన ఓ సినిమాకి కొనసాగింపు చిత్రం చేస్తా. 14 భాషల్లో రూపొందనున్న ఆ సినిమా భారీ స్థాయిలో ఉంటుంది" అని అన్నారు.

ఇదీచూడండి: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా: ఆకాశ్ పూరి

ABOUT THE AUTHOR

...view details