69th National Film Awards ceremony :నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సాగిన ఈ వేడుకలో వివిధ కేటగిరీల్లో అవార్డులు సాధించిన నటీ నటులను ఈ వేదికగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ నటుడిగా ఎంపికైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదగా అందుకున్నారు. 'పుష్ప' చిత్రానికిగాను ఆయన ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈయనతో పాటు ఆలియా భట్, కృతి సనన్, ఎంఎం కీరవాణి, శ్రేయ ఘోషల్ రాజమౌళి లాంటి ప్రముఖులు కూడా రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డులు అందుకున్నారు.
మరోవైపు ఉత్తమ తెలుగు చిత్రం 'ఉప్పెన'కుగాను చిత్ర నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సనా కూడా అవార్డును అందుకున్నారు. ఇక ఉత్తమ విమర్శకుడిగా ఎంపికైన తెలుగు సాహితివేత్త పురుషోత్తమాచార్యులు కూడా ఇదే వేదికగా అవార్డును అందుకున్నారు. 'చార్లి 777' సినిమాకు గాను కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, 'కొండ పొలం' సినిమాకుగాను లిరిసిస్ట్ చంద్రబోస్, 'పుష్ప' సినిమాకు గాను మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ జాతీయ అవార్డులను అందుకున్నారు.