తమిళనాడు.. చెన్నైలోని సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ జరిగింది. లాకర్లో ఉన్న 60 సవర్ల బంగారం, వజ్రాలు, నవరత్నాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై ఐశ్వర్య.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
"2019లో నా చెల్లెలి పెళ్లి తర్వాత మూడుసార్లు ఇళ్లు మారాను. సెయింట్ మేరీస్ రోడ్డులోని ఓ ఇల్లు, సీఐటీ నగర్లో నటుడి ధనుశ్ ఇల్లు, నాన్న గారి ఇల్లు.. ఈ మూడు ఇళ్లల్లో ఒక్కసారి కూడా లాకర్ ఓపెన్ చేయలేదు. లాకర్లో ఉంచిన నగలను తీయలేదు. తాజాగా లాకర్ తెరవగా.. అందులో ఉన్న 60 సవర్ల బంగారు నగలు, వజ్రాలు, నవరత్నాలు మాయమయ్యాయి. ఆభరణాలను సంబంధిత లాకర్లో ఉంచుతున్నట్లు నా ఇంట్లో పనిచేసే ఉద్యోగులకు తెలుసు" అని ఫిర్యాదులో రాసుకొచ్చారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
అయితే రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య.. నటుడు ధనుశ్‌తో విడిపోయే వేరేగా ఉంటున్నారు. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గతేడాది వీరిద్దరూ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్లో వారి పేర్లను మార్చుకుని వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను కూడా తొలగించారు.
వీరిద్దరు విడిపోతున్నట్లు గతేడాది జనవరి 27న ధనుశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం" అని ధనుశ్ లేఖలో పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితం, వీరి విడాకులు రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు కొన్ని వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. వారి కుటుంబాలు రజనీ కాంత్ నివాసంలో సమావేశమయ్యాయని అక్కడ చర్చలు జరిగాయని వారిద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నారని అంటున్నారు. ఈ వార్తలపై మాత్రం అటు ధనుశ్ కానీ, ఇటు ఐశ్వర్య కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఐశ్వర్య.. లాల్ సలామ్ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందులో రజనీ కాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.