2023 Top 5 Movies : గత కొన్ని సంవత్సరాల నుంచి టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్స్ అందుకుని సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 'బాహుబలి', 'పుష్ప1' 'ఆర్ఆర్ఆర్' ఇలా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాకుండా తెలుగు సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చిపెట్టాయి. ఇలా దాదపు గత 5 ఏళ్ల నుంచి ఏటా ఏదొక సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకుంటూ తెలుగు సినిమాల ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఆ పద్దతికి బ్రేక్ పడింది.
మరో రెండు నెలల్లో 2023 సంవత్సరం కూడా పూర్తి అవ్వనుంది. అయితే టాలీవుడ్ నుంచి ఇంతవరకూ ఏ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందలేదు. భారీ సినిమాలే వచ్చినప్పటికీ.. ఇండియా స్థాయిలో ఒక్క హిట్ కూడా పడలేదు.
ఇక ఇండియా వైడ్ టాప్ మూవీస్ లిస్ట్‌లో 'జవాన్', 'పఠాన్', 'జైలర్', 'లియో', 'గద్దర్2' ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఏ ఒక్క టాలీవుడ్ చిత్రం పేరు కూడా ఉండకపోవడం గమనార్హం. అయితే మిగతా భాషల సినిమాలు ఈ ట్రెండ్‌లో చేరుకుని రికార్డులు సృష్టించాయి కలెక్షన్ల పరంగాను దూసుకెళ్లాయి. ఏడాది మొదట్లో తెరకెక్కిన 'జవాన్' నుంచి తాజాగా వచ్చిన 'లియో' వరకు అన్నీ వేరే భాష సినిమాలే.