తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

2022 controversies: అనసూయ టూ దర్శన్​.. సినీ ఇండస్ట్రీలో వివాదాలివే! - ranveer photoshoot controversy

ప్రతి రంగంలోనూ వివాదాలు, విభేదాలు, గొడవలు, మాటల యుద్ధాలు సర్వ సాధారణం. అయితే, గ్లామర్‌ ఫీల్డ్​లో జరిగేవి మాత్రమే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. తమ మాట తీరు వల్ల కొందరు నటులు వివాదంలో చిక్కుకోగా మరికొందరు ఇతరత్రా కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. వారెవరు? చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌ అయిన అంశాలేంటి? 2022 క్యాలెండర్‌ ఓసారి తిరగేద్దాం..

2022 Round up Controversy issues in Indian cinema industry
అనసూయ ట్వీట్​.. దర్శన్​పై దాడి.. సినీ ఇండస్ట్రీలో వివాదాలివే!

By

Published : Dec 30, 2022, 10:17 AM IST

టికెట్‌ ధరలు పెంచాలా, వద్దా?.. కొవిడ్‌.. సినిమా రంగం, థియేటర్‌ వ్యవస్థపై బాగా ప్రభావం చూపింది. కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోవడంతో పలు సినిమా బడ్జెట్‌లు పెరిగాయి. దాంతో, టికెట్‌ ధరలను పెంచారు. టికెట్‌ రేట్‌ పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారని, ధరలు అందుబాటులో లేకపోవడం వల్ల రిపీట్‌ ఆడియన్స్‌ తగ్గిపోయారని పలువురు టాలీవుడ్‌ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మేరకు కొందరు ‘మా సినిమా టికెట్ ధరలు మీకు అందుబాటులో’ అనే కొత్త ప్రచారానికి నాంది పలికారు. తమ సినిమాల టికెట్‌ ధరలను తగ్గించి.. మల్టీప్లెక్స్‌లో అయితే ఇంత, సింగిల్‌ స్క్రీన్‌ అయితే ఇంత అంటూ ధరల పట్టికను ప్రేక్షకుల ముందు ఉంచారు. మరోవైపు, టికెట్‌ ధరలు తగ్గిస్తే పెద్ద చిత్రాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే చర్చ కొంతకాలం నడిచింది. గతేడాదీ టికెట్ల రేట్ల తగ్గింపు/పెంపు విషయంలో వివాదం తలెత్తింది.

చిత్రీకరణల నిలిపివేత.. ఓటీటీపై చర్చ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం లభించే వరకూ చిత్రీకరణలు జరపకూడదని పలువురు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆగస్టు 1 నుంచి సుమారు నెలపాటు షూటింగ్‌లు నిలిపివేశారు. పలు సమావేశాల్లో ఓటీటీ, వీపీఎఫ్‌ ఛార్జీలు, టికెట్‌ ధరలు, ఉత్పత్తి వ్యయం, యూనియన్‌ సమస్యలు, మేనేజర్‌ల పాత్ర, నటులు, సాంకేతిక నిపుణుల సమస్యల గురించి చర్చించారు. షూటింగ్స్‌ బంద్‌ విషయంలోనూ గందరగోళం నెలకొంది. మరోవైపు, థియేటర్లలో ప్రదర్శితమైన చిత్రాలను ఎంతకాలానికి ఓటీటీలోకి తీసుకురావాలన్న దానిపై సుదీర్ఘ చర్చలు సాగాయి. గతంలో.. 50 రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకోగా దాన్ని పది వారాలకు పొడిగించాలని భావించారు. అలా చేస్తే ప్లాఫ్‌ అయిన చిత్ర నిర్మాతలకు లాభదాయకంగా ఉండదనే వాదన వినిపించింది.

చిత్రీకరణల నిలిపివేత.. ఓటీటీపై చర్చ..

అనసూయ ఇలా.. నరేశ్‌ అలా.. "అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్ని సార్లు రావటం లేవటవ్వచ్చేమోకాని రావటం మాత్రం పక్కా!!" అని అనసూయ చేసిన ఓ ట్వీట్‌ ఎక్కడికో దారి తీసింది. తమ హీరోని ఉద్దేశించే అలా వ్యాఖ్యానించారంటూ పలువురు అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటామాటా పెరిగి ఆ వివాదం పోలీసు స్టేషన్‌ వరకూ చేరింది. ఈ ఏడాది బాగా ట్రోల్స్‌కు గురైన నటుల జాబితాలో నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ఉన్నారు. తమపై కొన్ని వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌ అసత్య ప్రచారం, ట్రోల్స్‌ చేస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని వెబ్‌సైట్స్‌ తమ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, వైరల్‌ చేస్తున్నాయని ఆరోపించారు. అర్జున్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా నుంచి నటుడు విశ్వక్‌సేన్‌ వైదొలగడం హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

ఆమిర్‌ సినిమాకు బాయ్‌కాట్‌ సెగ.. ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో అద్వెత్‌ చందన్‌ తెరకెక్కించిన చిత్రం లాల్‌సింగ్‌ చడ్డా. ఈ సినిమాకి బాయ్‌కాట్‌ సెగ తాకింది. ఆమిర్‌కు దేశభక్తి లేదని, గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇండియా అంటే గౌరవంలేకుండా మాట్లాడారని పలువురు సోషల్‌ మీడియా వేదికగా 'లాల్‌సింగ్‌ చడ్డా' చిత్ర విడుదల ఆపేయాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. దాంతో #boycotlaalsinghchaddha అనే హ్యాష్‌ట్యాగ్‌ కొన్ని రోజులు ట్రెండ్‌ అయింది. అన్ని సమస్యలు దాటుకొని ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించారు.

ఫొటోషూట్‌తో రణ్‌వీర్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ దుస్తుల్లేకుండా ఫొటోషూట్‌లో పాల్గొని, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అవి క్షణాల్లోనే వైరల్‌ అయ్యాయి. అంతే వేగంగా విమర్శలూ వచ్చాయి. రణ్‌వీర్‌ నగ్న ఫొటోలను పోస్ట్‌ చేసి మహిళల మనోభావాల దెబ్బతీశారంటూ ఓ ఎన్జీవో సంస్థ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుకాగా రణ్‌వీర్‌ విచారణకు హారజయ్యారు. తాను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోల్లో ఒకదాన్ని ఎవరో మార్ఫింగ్‌ చేసి, ఆ ఫొటోని వైరల్‌ చేశారని రణ్‌వీర్‌ పోలీసులకు వివరణ ఇచ్చినట్టు, ప్రైవేటు పార్ట్స్‌ కనిపించేలా తాను ఫొటోషూట్‌ చేయలేదని చెప్పినట్టు బాలీవుడ్‌ మీడియా పేర్కొంది.

రణ్​వీర్ ఫొటోషూట్​

సుదీప్‌, అజయ్‌దేవ్‌గణ్‌ల ట్వీట్‌ వార్‌.. హిందీ భాష గురించి అజయ్‌ దేవ్‌గణ్‌, సుదీప్‌ మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది. "పాన్‌ వరల్డ్‌ స్థాయిలో కన్నడ చిత్ర పరిశ్రమ సినిమాలు రూపొందిస్తోంది. బాలీవుడ్‌ వారే ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు.తమ సినిమాలను తమిళం, తెలుగు, కన్నడ.. ఇలా దక్షిణాది భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయినా విజయం అందుకోలేకపోతున్నారు" అని ఓ కార్యక్రమంలో సుదీప్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘మీ ఉద్దేశం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు మీరెందుకు మీ చిత్రాలను హిందీలో డబ్‌ చేస్తున్నారు? జాతీయ భాషగా హిందీ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ అదే ఉంటుంది’’ అని అజయ్‌ దేవ్‌గణ్‌ స్పందించగా అది చర్చకు దారితీసింది. సుదీప్‌ దానికి బదులివ్వగా అజయ్‌ మరో కౌంటర్‌ వేయడం.. ఈయన ఏదో అంటే సుదీప్‌ సమాధానం ఇవ్వడం.. ఇలా ఈ ఇద్దరి పేర్లు కొన్ని రోజులు ట్రెండ్‌ అయ్యాయి. తర్వాత, వివాదం సద్దుమణిగింది.

అభిమానులకు అక్షయ్‌ క్షమాపణ.. అజయ్‌ దేవ్‌గణ్‌, షారుఖ్‌ ఖాన్‌లతో కలిసి అక్షయ్‌ కుమార్‌ ఓ బ్రాండ్‌ వాణిజ్య ప్రకటనలో నటించారు. దాన్ని చూసిన అక్షయ్‌ అభిమానులు, పలువురు నెటిజన్లు అసహనానికి గురయ్యారు. ‘యువతను నాశనం చేసే ధూమపానం, మద్యపానం వంటి ప్రకటనలు నేను చేయను’ అని గతంలో అక్షయ్‌ ఇచ్చిన మాటను వారు గుర్తు చేస్తూ వ్యతిరేకతను తెలిపారు. సదరు యాడ్‌ నుంచి వైదొలగాలని కోరారు. దీనిపై స్పందించిన అక్షయ్‌.. ఒప్పందం కారణంగా న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆ ప్రకటన ప్రసారం అవుతుందని, భవిష్యత్తులో ఇలా చేయమని అభిమానులకు మాట ఇచ్చారు. తన చర్యల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణలు చెప్పారు. ఆ యాడ్‌ చేసినందుకు వచ్చిన మొత్తాన్ని మంచి పని కోసం వినియోగిస్తానన్నారు.

కశ్మీర్‌ ఫైల్స్‌పై ఇజ్రాయెల్ దర్శకుడి కామెంట్‌.. గోవా వేదికగా ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) వేడుకల్లో 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రాన్ని ప్రదర్శించారు. 'ఇఫి' జ్యూరీ హెడ్‌గా ఉన్న నడవ్‌ లాపిడ్‌ అది అసభ్యకర చిత్రమని వ్యాఖ్యానించారు. దాంతో దుమారం రేగింది. చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్‌ ఖేర్‌తోపాటు పలువురు రాజకీయ నేతలు ఇజ్రాయెల్‌కు చెందిన నడవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పరిణామాల అనంతరం నడవ్‌ లాపిడ్‌ క్షమాపణలు చెప్పారు.

కాళీ పోస్టర్‌.. దర్శకురాలు లీనా మణిమేగలై తెరకెక్కించిన ‘కాళీ’ అనే డాక్యుమెంటరీ పోస్టర్‌ వివాదానికి తెర తీసింది. అది మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెపై చర్చలు తీసుకోవాలంటూ ఫిర్యాదులూ నమోదయ్యాయి. ఈ వ్యవహారాన్ని కెనడాలోని భారతీయ హైకమిషన్‌ కూడా తీవ్రంగా పరిగణించింది.

కాళీ పోస్టర్ వివాదం

ఈ ఏడాది నిర్వహించిన ఆస్కార్‌ వేడుకల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమెడియన్‌ క్రిస్‌ రాక్‌.. నవ్వులు పంచాలనుకుని ప్రముఖ నటుడు విల్‌స్మిత్‌ సతీమణి జాడా పింకెట్‌ గురించి మాట్లాడారు. జుట్టు పూర్తిగా తొలగించుకొని వేడుకకు హాజరైన ఆమెను ‘జీ.ఐ.జేన్‌’ చిత్రంలో ‘డెమి మూర్‌’ ప్రదర్శించిన పాత్రతో పోల్చారు. ఈ చిత్రంలో ఆమె పూర్తిగా గుండుతో కనిపించడం గమనార్హం. జీ.ఐ.జేన్‌ సీక్వెల్‌లో కనిపించబోతున్నారా? అంటూ హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. సహనం కోల్పోయిన స్మిత్‌.. వేదికపైకి వెళ్లి క్రిస్‌ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ ఘటన యావత్‌ సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అదే స్టేజ్‌పై ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న స్మిత్‌.. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

దర్శన్‌పై దాడి..తన కొత్త చిత్రం ‘క్రాంతి’ సినిమా ప్రచారంలో భాగంగా కన్నడ హీరో దర్శన్‌ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై చెప్పుతో దాడి చేశాడు. గతంలో దర్శన్‌.. దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ గురించి అనుచిత వ్యాఖ్యాలు చేశారని, అందుకే అభిమాని ఆ ఘటనకు పాల్పడ్డాడని అక్కడి మీడియా పేర్కొంది. ప్రస్తుతం దీనిపై చర్చ కొనసాగుతోంది. పునీత్‌ సోదరుడు శివరాజ్‌ కుమార్‌, సుదీప్‌ తదితరులు స్పందించారు.

ఇదీ చూడండి:Tollywood 2022: క్రేజ్​ పెరిగింది.. రేటు మారింది.. కానీ ఆఖరిలో మాత్రం..

ABOUT THE AUTHOR

...view details