Tollywood Movies 2022: చిత్రసీమలో ఎప్పుడూ విజయాల శాతం తక్కువే. నిర్మాత మొదలుకొని.. ప్రదర్శన కారుడి వరకు అందరికీ లాభాలు తెచ్చిపెట్టే సినిమాలు కొన్నే. ఆ కాసిన్ని ఇచ్చే భరోసాతోనే పరిశ్రమ ముందుకు సాగుతుంటుంది. ఈసారీ అదే వరసే! ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాల మధ్య మొదలైన 2022లో ఆరు నెలల కాలం గడిచిపోయింది. అనువాదాలతో కలుపుకొని మొత్తం 115 సినిమాలు విడుదలయ్యాయి. ఎప్పట్లాగే అప్పుడప్పుడే అయినా..ఈసారి హిట్టు మాట కాస్త గట్టిగా వినిపించింది. కొన్ని సినిమాలు బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. మరికొన్ని ప్రారంభ వసూళ్లతో అదరగొట్టాయి. 'ఆర్.ఆర్.ఆర్' అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకర్షించింది. రూ.వందల కోట్లు రాబట్టిన సినిమాలతోపాటు.. అంచనాలు అందుకోలేక చతికిలపడినవీ ఉన్నాయి. పరిమిత, మధ్యస్థ వ్యయంతో రూపొందినవి బాక్సాఫీసు దగ్గర ప్రభావం చూపించక పోవడం చిత్రసీమకి ఒకింత ఎదురుదెబ్బే.
ఎప్పుడూ సంక్రాంతి సినిమాలతోనే తెలుగు సినిమా బాక్సాఫీసు వేట మొదలు పెడుతుంటుంది. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో సంక్రాంతి సీజన్ సాగింది. నాగార్జున, నాగచైతన్య కథా నాయకులుగా నటించిన 'బంగార్రాజు' మినహా అగ్ర హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. 'రౌడీబాయ్స్', 'హీరో' చిత్రాలొచ్చాయి. అవి యువతరాన్ని మాత్రం మెప్పించాయి. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించలేకపోయాయి. 'బంగార్రాజు' పండగ సినిమాగా కనిపించి కాసిన్ని వసూళ్లని సొంతం చేసుకుంది. టికెట్ ధరలు, కరోనా భయాల మధ్య పెద్ద చిత్రాలు విడుదల కాలేకపోయాయి. దాంతో ఓ మంచి సీజన్ వృథా అయినట్టయింది. ఫిబ్రవరిలోనే బాక్సాఫీసు దగ్గర కాస్త సందడి కనిపించింది. 'డీజే టిల్లు' ప్రేక్షకుల్ని నవ్వించింది. పవన్‌కల్యాణ్ - రానాల 'భీమ్లానాయక్'తో థియేటర్ల దగ్గర క్యూ కనిపించింది.
వసూళ్లే వసూళ్లు
ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, భారీ అంచనాలున్న 'ఆర్‌ఆర్‌ఆర్', 'రాధేశ్యామ్' మార్చిలోనే విడుదలయ్యాయి. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'రాధేశ్యామ్' ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన దీనికి ప్రారంభ వసూళ్లే దక్కాయి. 'ఆర్‌ఆర్‌ఆర్' అదరగొట్టింది. రాజమౌళి మార్క్ విజువల్స్, ఎన్టీఆర్ - రామ్‌చరణ్‌ల నటన చిత్రాన్ని నిలబెట్టాయి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిసింది. థియేటర్లలోనే కాదు, కొన్నాళ్లుగా ఓటీటీ వేదికలో దీన్ని చూస్తున్న ప్రేక్షకులు 'శభాష్.. భారతీయ సినిమా' అని మెచ్చుకుంటున్నారు. ఏప్రిల్ మాసంలోనూ తెలుగురాష్ట్రాల్లోని బాక్సాఫీసులు కళకళలాడాయి. యశ్ కథానాయకుడిగా నటించిన 'కేజీఎఫ్2', తొలి చిత్రానికి దీటుగా ప్రేక్షకులకి చేరువైంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ మరోసారి ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. 'ఆచార్య'తో ఆ పరంపర కొనసాగుతుందని ఆశించారంతా. ఇది మెప్పించలేకపోయింది.