2022 HIT FLOP movies: అప్పుడే సినీ క్యాలెండర్లో నాలుగు నెలలు చకచకా మారిపోయాయి. ఓవైపు కొవిడ్ భయాలు.. మరోవైపు టికెట్ రేట్ల సమస్యలు.. ఇవన్నీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ నెమ్మదిగా నూతనోత్తేజాన్ని సంతరించుకుంది చిత్రసీమ. ఈ నాలుగు నెలల్లో దాదాపు పాతికకుపైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో చిన్న సినిమాలతో పాటు కొన్నేళ్లుగా ఊరిస్తూ వచ్చిన భారీ చిత్రాలూ ఉన్నాయి. ఇందులో కొన్ని బాక్సాఫీస్ ముందు భారీ వసూళ్లతో సత్తా చాటగా.. ఇంకొన్ని అంచనాలు అందుకోలేక చతికిల పడ్డాయి. మరి మొత్తంగా ఈ నాలుగు నెలల్లో చిత్రసీమకు ఎదురైన జయాపజయాల్ని ఒక్కసారి ఆరా తీస్తే..
ఈ ఏడాది ఆరంభంలోనే కొవిడ్ మూడో దశ ప్రభావం చిత్ర సీమపై స్పష్టంగా కనిపించింది. ఫలితంగా పెద్ద చిత్రాలన్నీ వెనక్కి తగ్గడంతో.. చిన్న సినిమాల సందడుల మధ్య జనవరి చప్పగా మొదలైంది. జనవరి 1న రామ్‌గోపాల్ వర్మ 'ఆశా ఎన్కౌంటర్', వరుణ్ సందేశ్ 'ఇందువదన' వంటి చిత్రాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. ఈ రెండూ దారుణ ఫలితాల్నే చవిచూశాయి. కొవిడ్ భయాల వల్ల సంక్రాంతికి రావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి బడా చిత్రాలన్నీ వాయిదా పడటంతో.. ఆ అవకాశాన్ని 'అతిథి దేవోభవ', 'రౌడీ బాయ్స్', 'హీరో' వంటి చిన్న చిత్రాలు అందిపుచ్చుకున్నాయి. ఆఖరి నిమిషంలో నాగార్జున, నాగచైతన్యల 'బంగార్రాజు'తో పండగ బరిలోకి దిగడంతో బాక్సాఫీస్ వద్ద ఉత్సాహకర వాతావరణం కనిపించింది. వీటిలో ఈ ఒక్క పెద్ద సినిమా తప్ప మిగిలిన చిన్న చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. 'హీరో' మంచి ప్రయత్నంగా ప్రేక్షకుల మెప్పు లభించింది. కరోనా పరిస్థితుల వల్ల పండగ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లపై ఆంక్షలు విధించారు. దీంతో సంక్రాంతి తర్వాతి వారం ఏ ఒక్క చిత్రం బాక్సాఫీస్ ముందుకు రాలేదు. ఇక జనవరి ఆఖర్లో 'గుడ్‌లక్ సఖి'గా ప్రేక్షకుల ముందుకొచ్చింది కీర్తి సురేష్. షూటింగ్ ఆట నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కనీస ఆదరణ దక్కలేదు.
టిల్లు నవ్వులు.. భీమ్లా గర్జన..ఫిబ్రవరి నాటికి కొవిడ్ మూడో దశ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్త చిత్రాల సందడి రెట్టింపయ్యింది. ఫిబ్రవరి 4న విశాల్ 'సామాన్యుడు'గా బాక్సాఫీస్ ముందుకొచ్చారు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అయితే కథ కథనాలు అంత ఆసక్తికరంగా సాగకపోవడంతో.. సినీప్రియుల మెప్పు పొందలేకపోయింది. 11న రవితేజ ‘ఖిలాడీ’తో.. విష్ణు విశాల్ ‘ఎఫ్ఐఆర్’తో, హర్ష్ కనుమిల్లి ‘సెహరి’తో బాక్సాఫీస్ ముందు పోటీ పడ్డారు. వీటిలో ఖిలాడీ కొంచెం ఫర్వాలేదనిపించినా, మిగతావి కనీస ఆదరణ పొందలేకపోయాయి. 12న విడుదలైన ‘డీజే టిల్లు’ థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించింది. ఈ ఏడాది విజయపతాకం ఎగరేసిన తొలి చిన్న సినిమాగా ఘనత అందుకొంది. విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. ముఖ్యంగా సిద్ధూ జొన్నలగడ్డ నటనకు, ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరుకు సినీ ప్రియుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఆ మరుసటి వారం మోహన్‌బాబు ‘సన్నాఫ్ ఇండియా’గా థియేటర్లలో సందడి చేశారు. ఈ సినిమాకు హీరోగానే కాక స్క్రీన్‌ప్లే రచయితగానూ వ్యవహరించారు. అయితే ఆయన మ్యాజిక్కు బాక్సాఫీస్ ముందు వర్కవుటవ్వలేదు. ఫిబ్రవరి 24న ‘వలిమై’, 25న ‘గంగూబాయి కాఠియావాడి’, ‘భీమ్లానాయక్’ వంటి బడా చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వరుస కట్టాయి. వీటిలో పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ మాత్రమే మంచి వసూళ్లతో సత్తా చాటింది.