Puspha 2 OTT Rights: 'పుష్ప: ది రైజ్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు, మలయాళం, హిందీతోపాటు మిగిలిన భాషల్లో మంచి టాక్‌తో పాటు కలెక్షన్లను రాబట్టింది. ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లోనూ విడుదలైన ఈ మూవీ విశేష ఆదరణను అందుకుంది. అయితే ఈ మూవీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వదిలేశారు సుకుమార్. దీంతో మలి భాగంలో ఏం చూపించబోతున్నారా? అన్న ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. దీని కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ రెండో భాగం గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రైట్స్ కొనగోలుకు ఫుల్ డిమాండ్ పెరిగిందట! వాటిని సొంతం చేసుకునేందుకు రెండు బడా సంస్థలు తీవ్రంగా పోటీ పడుతున్నాయని తెలిసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. ఈ ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు విపరీతంగా ఆసక్తి చూపుతున్నాయట. ఇందుకోసం భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక నిర్మాతలు కూడా సినిమా ప్రారంభానికి ముందే ఈ రెండింటిలో ఓ సంస్థతో భారీ మొత్తానికి డీల్‌ను ఓకే చేయాలని భావిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.