తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫస్ట్ సినిమాలోనే 11 నిమిషాల పాట.. కృష్ణంరాజు రికార్డ్!

తెలుగు సినీ రంగంలో ఏకైక రెబల్‌ స్టార్‌గా పేరుగాంచిన నటుడు కృష్ణంరాజు మరణంతో యావత్​ సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. అయితే ఆయన నటించిన తొలి సినిమా 'చిలకా గోరింకా'లో 11 నిమిషాలపాటు సాగే ఓ పాటను రంగుల్లో చిత్రీకరించారు. అప్పట్లో ఆ పాట చిత్రసీమలో రికార్డు సృష్టించింది. ఓ సారి ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం రండి.

11 minutes song in actor krishnam raju first movie chilaka gorinka
11 minutes song in actor krishnam raju first movie chilaka gorinka

By

Published : Sep 11, 2022, 7:37 AM IST

Updated : Sep 11, 2022, 9:09 AM IST

Krishnam Raju First Movie 11 Minutes Song : దర్శకత్వం చేపట్టిన తొలి చిత్రానికే జాతీయ అవార్డులు దక్కడం తెలుగు చలన చరిత్రలో ఒక రికార్డే. ఆ రికార్డులు అందించిన ఘనత కొల్లి ప్రత్యగాత్మదే. 'భార్యాభర్తలు' సినిమాతో పూర్తి స్థాయి దర్శకునిగా ఎదిగిన ప్రత్యగాత్మ.. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.ఛాయా చిత్ర సంస్థ నిర్మాత కె.సుబ్బరాజు ప్రత్యగాత్మతో 'మంచి మనిషి' చిత్రం నిర్మిస్తున్నప్పుడు నటుడు కృష్ణంరాజు పరిచయం జరిగింది. 'ఆత్మా ఆర్ట్స్‌' పేరిట ప్రత్యగాత్మ ఒక స్వంత నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి చిత్రం 'చిలకా గోరింకా' నిర్మించారు. అందులో కృష్ణంరాజును హీరోగా పరిచయం చేశారు. నటుడు పద్మనాభం నిర్మించిన 'దేవత', ఎ.పూర్ణచంద్రరావు నిర్మించిన 'ఆడపడుచు' వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు కె.హేమాంబరధరరావు ప్రత్యగాత్మకు తమ్ముడే.

రెబల్‌స్టార్‌కు తొలి చిత్రం..
Krishnam Raju First Movie Chilaka Gorinka : పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సంపన్న కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు హైదరాబాదు బద్రుకా కళాశాలలో కామర్స్‌ పట్టభడ్రుడు. 'బావమరదళ్లు' సినిమా నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో 1963లో కృష్ణంరాజు మద్రాసు చేరుకున్నారు. అక్కడే ప్రత్యగాత్మ కృష్ణంరాజుకు స్క్రీన్‌ టెస్టు నిర్వహించి తాను తీయబోయే కొత్త సినిమాలో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు.

'చిలకా గోరింకా' సినిమా పోస్టర్​

నాటకరంగ అనుభవం ఉంటే మంచిదని ఈలోగా నాటకాలలో నటిస్తూ ఉండమని సలహా ఇవ్వడంతో 'నాగమల్లి', 'పరివర్తన' వంటి నాటకాల్లో నటించి అనుభవం గడించారు. 'మంచి మనిషి' సినిమా షూటింగులకు హాజరవుతూ నటనలోని మెళకువలు గ్రహించారు. 1965 ఆగస్టు 6న ప్రత్యగాత్మ సొంత చిత్రం 'చిలకాగోరింకా' సినిమా షూటింగు మొదలైంది. అందులో సీనియర్‌ నటి కృష్ణకుమారి సరసన కృష్ణంరాజును ప్రత్యగాత్మ హీరోగా పరిచయం చేశారు.

కథలోకి వెళితే..
అరవై ఏళ్లు నిండిన సంజీవరావు (ఎస్‌.వి.రంగారావు), శాంత (అంజలీదేవి) చిలకాగోరింకల్లా అన్యోన్యమైన దంపతులు. ముప్పై ఏళ్ల దాంపత్య జీవితాన్ని సంజీవరావుకు స్మృతిగా మిగిల్చి, ఒక పాపకు జన్మనిచ్చి, శాంత శాశ్వతంగా నిష్క్రమించింది. లోకం దృష్టిలో శాంత మరణించిందేమోకాని, సంజీవరావుకు మాత్రం ఆమె తన హృదయంలో పదిలంగానే ఉంది. రాజా (కృష్ణంరాజు), పాపారావు (రమణారెడ్డి) అనే బాగా డబ్బున్న షావుకారు కొడుకు. శశి (రమాప్రభ) అతని కూతురు. సాగరయ్య (పినిసెట్టి) కొడుకు భద్రం (పద్మనాభం) ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు రాజా, ఉష (కృష్ణకుమారి)ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తండ్రి మాత్రం డబ్బుతోనే లోకాన్ని చూసే వ్యక్తి. ఎలాగైనా తండ్రిని అంగీకరింపజేసి ఉషను తనదాన్ని చేసుకోవాలని రాజా కలలు కంటాడు.

ఉష అందమైన నడత ఉన్న పిల్ల. తల్లికి ఆలంబనగా ఉండాలనేది ఆమె ఆశయం. ఆమె రాజాను మనస్ఫూర్తిగా ప్రేమించింది. కానీ విధి ఎదురుతిరిగి ఆమెను అవిటిదాన్ని చేసింది. నడకలేని తాను రాజాకు కనిపించకూడదనే ఉద్దేశంతో ఉష దూరంగా వెళ్లి తనకు తానుగా అజ్ఞాతం విధించుకుంది. సంజీవరావు ఆశ్రయం పొంది అతనికి, అతని కూతురుకి తనే సర్వస్వమై సేవలు చేసేందుకు సిద్ధపడింది. సంజీవరావు పంచన చేరిన ఉషను రాజా అపార్థం చేసుకొంటాడు. డబ్బుకోసమే ఉష సంజీరావు పంచన చేరిందని భ్రమించాడు.

ఆ సమయం లోనే రాజా బతుకులోకి సరస (వాసంతి) ప్రవేశించాలని ప్రయత్నించింది. కానీ రాజా ఉషని తప్ప వేరెవరినీ ప్రేమించలేడు. అతని నిస్వార్థ ప్రేమ ముందు సరస నిలువలేకపోయింది. మంచి మనసుతో సరస, రాజాకు ఉష మీదవున్న దురభిప్రాయాన్ని తుడిచివేయగలిగింది. ఆమె సహకారంతో నిజం తెలుసుకున్న రాజా, అవిటిదైనా ఉషను స్వీకరించేందకు ముందుకొచ్చాడు. చివరికి సినిమా సుఖాంతం.

నటుడు కృష్ణంరాజు

సాలూరివారి స్వరాలు..
'చిలాకా గోరింకా' సినిమాకు సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరావు. ఇందులో మూడు పద్యాలు, ఏడు పాటలున్నాయి. వాటినన్నింటినీ రాసింది మహాకవి శ్రీశ్రీ కావడం విశేషం. పద్యాలను మాధవపెద్ది సత్యం ఆలపించారు. పాటల్లో ముఖ్యమైంది ఘంటసాల ఆలపించిన 'నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే' అనే మలయమారుత రాగ ఛాయల్లో స్వరపరచిన గీతం. షష్టిపూర్తి జరుపుకున్న ఎస్‌.వి.రంగారావు పడకగదిలో అంజలీదేవిని ఉద్దేశిస్తూ పాడే పాట ఇది. 'పడకింటి శయ్యచెంత నీ మేను తాకినంత... మన గీతాలలో జలపాతాలలో నవరాగాలు మ్రోగెనులే' అంటూ శృంగార రసాన్ని బంగారంగా పండించిన శ్రీశ్రీ అభినందనీయుడు. ఎస్‌.వి.రాంగారావు, కృష్ణకుమారి, బేబీ కౌసల్య మీద చిత్రీకరించిన 'పాపా కథ విను బాగా విను విను' పాటను ఘంటసాల, సుశీల ఆలపించారు. ఇందులో శ్రీశ్రీ ప్రయోగించిన 'బుజబుజ రేకుల గొరవంకా బుజ్జా రేకుల చిలకా- మనసు కలియంగా జతగా హాయిగా నిలువంగా' చరణం తమాషాగా ఉంటుంది.

సినిమా విశిష్టతలు

  • 'ఈ సినిమా కథ వయసు మళ్లిన పాత్రల మీద నడుస్తుంది. అది కొత్తదనం అని నేను భావించను. కథతోపాటు సంగీతానికి మంచి మార్కులే వచ్చాయి. కానీ విజయవంతం కాలేదు. సినిమాను కళాత్మకంగా అయినా తీయాలి, లేకుంటే వ్యాపార ధోరణిలోనైనా తీయాలి. రెంటిని మేళవించి, రెండూ సాధించాలనుకోకూడదు. అక్కడే నేను దెబ్బతిన్నాను' అని ప్రత్యగాత్మ వివరించారు.
  • చిలకా గోరింకా సినిమా ఆర్థిక విజయం సాధించక పోయినా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది బహుమతిని సాధించింది.
  • పదకొండు నిమిషాల పాటు సాగే ఓ పాటను రంగుల్లో చిత్రీకరించడం విశేషం. టి.ఆర్‌.జయదేవ్‌, నూతన్‌, సుశీల ఆలపించిన ఈ పాటను కృష్ణంరాజు, కృష్ణకుమారి, వాసంతిలపై చిత్రీకరించారు.
  • చిలకా గోరింకా' చిత్ర నిర్మాణ సమయంలో ప్రత్యగాత్మ హిందీలో తొలిసారి 'చోటా భాయి' (1966) సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో వచ్చిన 'మా వదిన' సినిమా దీనికి మూలం. హిందీలో రజతోత్సవం జరుపుకుంది. అందులో ప్రధానపాత్ర పోషించిన నటి నూతన్‌ చేత 'చిలకా గోరింకా' సినిమాలో 'నేనే రాయంచనై, చేరి నీ చెంతనే ఆడాలి' అనే పాటను పాడారు. నూతన్‌ గళాన్ని కృష్ణకుమారికి వాడుకున్నారు.
  • చిత్ర కథానాయిక కృష్ణకుమారి అప్పటికే వంద సినిమాలు పూర్తిచేసిన సీనియర్‌ నటి. నూతన నటుడు కృష్ణంరాజు సరసన ఆమె నటించడానికి కారణం అంతకు ముందు ప్రత్యగాత్మ దర్శకత్వం నిర్వహించిన భార్యభర్తలు, కులగోత్రాలు సినిమాలలో హీరోయిన్‌గా నటించి ఉండడమే.
  • రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి ఇందులో సాగరయ పాత్రను ధరించడం విశేషం.
  • కొన్ని అవుట్‌ డోర్‌ దృశ్యాలను హైదరాబాద్‌కు చేరువలో వున్న భువనగిరిలో చిత్రీకరించారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన భువనగిరికోటను, దాని పరిసర రమణీయ ప్రాంతాలను ఈ సినిమా అవుట్‌ డోర్‌ పాటలను హైదరాబాద్‌ శాసనసభకు సమీపంలో ఉండే నౌబత్‌ పహాడ్‌, పబ్లిక్‌ గార్డెన్ వద్ద చిత్రీకరించారు.
  • హాస్యనటి రమాప్రభ కూడా ఈ చిత్రంతోనే తెరంగ్రేటం చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 11, 2022, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details