తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTT Movies: ఓటీటీలో సినిమా.. లాభమా? నష్టమా? - ఓటీటీ థియేటర్లు

OTT Release: ఇకపై థియేటర్‌లోకి వచ్చిన 50 రోజుల తర్వాతే ఓటీటీల్లోకి సినిమా విడుదల చేయాలని ఇటీవలే టాలీవుడ్​ నిర్మాతలు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ సమయాన్ని 70 రోజులకు పెంచాలని ప్రస్తుతం నిర్మాతలు పట్టుబడుతున్నారు. మరి దీనివల్ల లాభమా? నష్టమా? తెలుసుకుందాం..

OTT Release
ఓటీటీలో సినిమా.. లాభమా? నష్టమా?

By

Published : Jul 22, 2022, 9:58 AM IST

OTT Release: కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు , అన్ని ఇండస్ట్రీల్లోనూ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఓటీటీల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రేక్షకుడు థియేటర్‌కు రాలేని పరిస్థితుల్లో.. సినిమానే ప్రేక్షకుడికి వద్దకు తీసుకెళ్లేందుకు ఓటీటీ మాధ్యమం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పటికీ కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయంటే ఓటీటీల పరిధి ఎంత విస్తృతమైందో ఇట్టే అర్థమవుతోంది. అయితే, ఈ పరిణామమే థియేటర్ల పరిస్థితిని ప్రశార్థకంగా మార్చింది. ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు యోచిస్తున్న తరుణంలో ఓటీటీల్లో త్వరగా సినిమాలను విడుదల చేయటమూ ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ 45 రోజుల దాకా సినిమా విడుదల చేయకూడదన్న నిర్మాతలు ఆ సమయాన్ని 70 రోజులకు పెంచాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం ఓటీటీల వల్లే ప్రేక్షకులు థియేటర్‌కు రాలేకపోతున్నారా అంటే, అందుకు ఇంకా చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి.

బెంబేలెత్తిస్తున్న టికెట్‌ ధరలు..సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలంటే మొదటగా గుర్తొచ్చేది టికెట్‌ ధరలు. కరోనా తర్వాత సినిమా పరిశ్రమను ఆదుకునే చర్యల్లో భాగంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. పెద్ద సినిమాల విడుదల సమయంలోనైతే మొదటివారం 50శాతం అదనంగా వసూలు చేసేందుకు పచ్చజెండా ఊపాయి. వేసవికాలంలో విడుదలైన సినిమాలన్నీ భారీ బడ్జెట్‌, బిగ్‌స్టార్స్‌ సినిమాలు కావడంతో ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపారు. అయితే, సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన కుటుంబ ప్రేక్షకులు అంతంతమాత్రమే. దీనికి ప్రధాన కారణం టికెట్‌ ధరలు. వీటికి పార్కింగ్‌ ఫీజు, క్యాంటీన్‌లో తినుబండారాల ధరలు అదనం. ఇవన్నీ సామాన్యుడిని థియేటర్‌కు రప్పించకుండా చేసే ప్రతిబంధకాలే. ఓటీటీల కన్నా ముందు వీటిపై ఓ నిర్ణయానికి వస్తే, ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించవచ్చన్నది సగటు సినీ అభిమాని సూచన. ఈ విషయంలో సినీ నిర్మాత దిల్‌ రాజు ఒక అడుగు ముందే ఉన్నారు. ‘ఎఫ్‌3’కి టికెట్‌ ధరలు తగ్గించిన ఆయన ఇప్పుడు ‘థ్యాంక్‌ యూ’ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. మరి ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ప్రొడక్షన్‌ కాస్ట్‌ తగ్గేనా?..ఒకప్పుడు స్క్రిప్ట్ పూర్తయ్యాక, నటీనటుల డేట్స్‌ అన్నీ కుదిరితేనే దర్శక-నిర్మాతలు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేవారు. రానురానూ మార్పులు వచ్చాయి. షూటింగ్‌ మొదలయ్యే ముందు కూడా సన్నివేశాలు రాసుకుంటూ కూర్చోవడం వల్ల సినిమా వ్యయం పెరిగిపోవడమే కాకుండా, నాణ్యతా దెబ్బతింటోందని సీనియర్‌ నటులు, రచయితలు వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు. స్క్రిప్ట్‌ పూర్తయిన తర్వాత మరింత మెరుగు కోసం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ, అప్పటికప్పుడు కొత్త సన్నివేశాలు రాయడం కూడా నిర్మాణ వ్యయం పెరగడానికి కొన్నిసార్లు కారణమవుతోంది. ఇక సృజనాత్మకత పేరుతో దర్శకులు వేయించే సెట్లు, అనవసర హంగులు, విదేశీ ప్రయాణాలు.. ఇవన్నీ నిర్మాణ వ్యయాన్ని తడిసి మోపెడు చేస్తున్నాయి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా హీరో-హీరోయిన్ల రెమ్యునరేషనూ ఓ కారణమే. అవసరం ఉన్నా లేకపోయినా విజువలైజేషన్‌ పేరుతో చేస్తున్న గ్రాఫిక్స్‌ నాసిరకంగా ఉండటమే కాకుండా, సినిమాపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి.

వీపీఎఫ్‌ ఛార్జీల పరిస్థితి ఏంటి?..తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లన్నీ డిజిటల్‌ స్క్రీన్‌లే. సర్వీస్‌ ప్రొవైడర్లైన క్యూబ్‌సినిమా, యూఎఫ్‌వో మూవీలు వీపీఎఫ్‌ (వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు) వసూలు చేస్తున్నాయి. అయితే, కరోనా సమయంలో వీటికి మినహాయింపు ఇచ్చాయి. ఆ సమయంలో నెలకు దాదాపు రూ.12 నుంచి 15లక్షల నష్టం వచ్చినా థియేటర్లకు జనాన్ని రప్పించాలనే ఉద్దేశంతో భరించాయి. మళ్లీ పరిస్థితులు చక్కబడటంతో వాటిని యథాతథంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమాకు వారు ఉపయోగించే పరికరాలను బట్టి రూ.10 వేల నుంచి రూ.17వేల వరకూ వీపీఎఫ్‌ ఛార్జీలు ఉన్నాయి. వీటి ధరలను కూడా స్థిరీకరిస్తే బాగుంటుందని నిర్మాతల మండలి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

పది వారాల తర్వాతే ఓటీటీ.. లాభమా? నష్టమా?..సినిమా విడుదల తర్వాత నిర్మాతలకు అదనపు ఆదాయం డిజిటల్‌ రైట్స్‌ ద్వారా వచ్చేవి. వీసీఆర్‌లు మొదలుకొని సీడీల వరకూ ఆ పరంపర కొనసాగింది. కరోనా తరవాత నిర్మాతలకు మరొక ఆదాయ మార్గాన్ని చూపింది ఓటీటీ. చిత్రీకరణ పూర్తి చేసుకుని, కరోనా కారణంగా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఓటీటీ చాలా మంది నిర్మాతలను గట్టెక్కించింది. ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు క్రమంగా థియేటర్‌లకు వచ్చేందుకు ఆసక్తి కనపరచడం లేదు. థియేటర్‌కు రావాలా? వద్దా? అన్నది ప్రేక్షకుడి వ్యక్తిగత అభిరుచి, అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుంది. సినిమాలో సత్తా ఉన్నప్పుడే ప్రేక్షకుడు రెండున్నర గంటల పాటు థియేటర్‌లో కూర్చొనేందుకు ఆసక్తి చూపుతాడు. ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘కేజీయఫ్‌2’, ‘సర్కారువారి పాట’, ‘ఎఫ్‌3’, ‘విక్రమ్‌’ వంటి వాటిని ప్రేక్షకులు థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ సినిమాలన్నీ దాదాపు నెలన్నర తర్వాతే ఓటీటీలో వచ్చాయి. అంటే 45 రోజుల తర్వాత. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’ తదితర చిత్రాలు రెండు మూడు వారాల్లోనే ఓటీటీలో వచ్చాయి. కొన్ని చిన్న చిత్రాలైతే వారానికే ఓటీటీ బాటపట్టాయి. థియేటర్‌లో కొనసాగలేని చిన్న చిత్రాల నిర్మాతలు ఓటీటీల ద్వారా గట్టెక్కారన్నది జగమెరిగిన సత్యం.

బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టిన సినిమాను మళ్లీ ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. కానీ, పెద్దగా మెప్పించలేని సినిమాలను పదివారాల గడువు పెట్టుకుని ఓటీటీలో ఆలస్యం చేస్తే, ఎంతమంది చూస్తారన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే ప్రతివారం వివిధ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. ఇతర భాషల్లో సినిమాలను, తెలుగు ఆడియోతో, సబ్‌ టైటిళ్లతో చూసే ప్రేక్షకుల సంఖ్యా బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఫ్లాప్‌ అయిన సినిమాలు ఓటీటీలో చూడాలన్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. థియేటర్‌కు వెళ్తే, రెండున్నర గంటలు కూర్చోవాల్సిందే. కానీ, చేతిలో మొబైల్‌/రిమోట్‌ ఉంటే ఓటీటీలో పూర్తి సినిమా చూసేవారూ తక్కువే. ‘థియేటర్లలో విడుదలైన సినిమాలను ఎంతకాలానికి ఓటీటీలోకి తీసుకురావాలనే విషయమై ఎంతో రీసెర్చ్‌ జరుగుతోంది. ఫ్లాప్‌ అయిన సినిమాను త్వరగా ఓటీటీకి ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి లాభం చేకూరినట్టువుతుంది. కానీ, అది భవిష్యత్తులో థియేటర్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని బన్ని వాసు అభిప్రాయం వ్యక్తం చేశారు.‘రన్‌ వే 34’, సమ్రాట్‌ పృథ్వీరాజ్‌, ‘ధాకడ్‌’ ‘అటాక్‌’, ‘బచ్చన్‌ పాండే’వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించలేక రెండు, మూడు వారాలకే ఓటీటీ బాటపట్టి, నష్టాల నుంచి కొంత మేర గట్టెక్కాయి. తెలుగులోనూ ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని సినిమాలు పది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం ఎంత వరకూ సహేతుకమైందన్నది ఇప్పటికీ ఇంకా ఆలోచించాల్సిన విషయమే.

ఇదీ చూడండి: చైతూపై సామ్​ షాకింగ్ కామెంట్స్​.. 'ఒకే రూమ్​లో ఉంటే కత్తులతో..'

ABOUT THE AUTHOR

...view details