తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చెంప దెబ్బ ఎఫెక్ట్.. విల్​ స్మిత్​ షాకింగ్​ నిర్ణయం - మోషన్​ పిక్చర్స్​ అకాడమీ

Will Smith Resign Oscars 2022: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో వేదికపైనే వ్యాఖ్యాత, కమెడియన్ క్రిస్​రాక్​పై నటుడు విల్​స్మిత్ చేయి చేసుకున్న ఘటన తీవ్ర వివాదంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన విల్​స్మిత్​ ​.. మోషన్​ పిక్చర్​ అకాడమీకి రాజీనామా చేశారు.

విల్​స్మిత్
విల్​స్మిత్

By

Published : Apr 2, 2022, 8:27 AM IST

Updated : Apr 2, 2022, 9:06 AM IST

Will Smith Resign Oscars 2022: ప్రతిష్ఠాత్మక సినీ వేడుక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ నటుడు విల్‌ స్మిత్‌.. వ్యాఖ్యాత క్రిస్‌ రాక్‌పై చేయి చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మోషన్‌ పిక్చర్‌ అకాడమీకి విల్ ​స్మిత్​.. శుక్రవారం రాజీనామా చేశారు. బోర్డు ఎలాంటి శిక్షలు వేసినా దానికి తాను అంగీకరిస్తానని తెలిపారు.

"నేను ఆస్కార్ వేడుకలో ప్రవర్తించిన విధానం షాకింగ్​గా, బాధాకరంగా ఉంది. అందుకే అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బోర్డు సభ్యులు తీసుకునే ఎలాంటి చర్యలకైనా నేను సిద్ధం. నా ప్రవర్తనకు సంబంధించిన ఎలాంటి శిక్షలు వేసినా వాటన్నంటినీ పూర్తిగా అంగీకరిస్తాను. 94వ అకాడమీ అవార్డుల వేడుకలో నా ప్రవర్తన క్షమించరానిది."

- విల్​స్మిత్​, నటుడు

ఆస్కార్‌ వేడుకలో జరిగిన ఘటనపై అకాడమీ గవర్నర్ల బోర్డు బుధవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. క్రిస్‌ రాక్‌పై చేయి చేసుకున్నందుకుగానూ స్మిత్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించింది. ఈ ఘటనపై స్మిత్‌ 15 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సమావేశం అనంతరం అకాడమీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ సమావేశమైన రెండు రోజుల తర్వాత స్మిత్ రాజీనామా చేయడం గమనార్హం.

ఇదీ జరిగింది:ఇటీవల జరిగిన 94వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా వ్యాఖ్యాత, కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ ఓ కామెడీ ట్రాక్‌ను చెబుతూ అందులో విల్‌ స్మిత్‌ సతీమణి జాడా పింకెట్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. అలోపేసియా అనే అనారోగ్య సమస్య కారణంగా జాడా పూర్తిగా గుండుతో కన్పించడంతో.. క్రిస్‌ రాక్‌ ఆమెను 'జీ.ఐ.జేన్‌' చిత్రంలో 'డెమి మూర్‌' పోషించిన పాత్రతో పోల్చారు. దీంతో సహించలేకపోయిన విల్‌ స్మిత్‌ నేరుగా వేదికపై వెళ్లి క్రిస్‌ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత విల్‌ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. అయితే ఈ ఘటనపై వేదికపైనే స్పందించిన స్మిత్‌ అకాడమీకి, సహచరులకు క్షమాపణలు తెలిపారు. ఆ మరుసటి రోజు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ క్రిస్‌ రాక్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన భార్యపై జోకులు వేయడంతో భరించలేకే అలా ప్రవర్తించానని రాసుకొచ్చారు. ఈ వ్యవహారం కాస్త తీవ్ర వివాదానికి దారితీసింది.

ఇదీ చదవండి:'ఆర్​ఆర్​ఆర్'​ జోష్​తో.. 'శుభకృత్​'లోకి తెలుగు చిత్రసీమ..

Last Updated : Apr 2, 2022, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details