భారత్‌లో కశ్మీర్ ఎప్పటికీ భాగంగానే ఉంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, కశ్మీర్‌కు ఇద్దరు ప్రధానులు, ఇద్దరు రాష్ట్రపతులు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. జాతీయ పౌర రిజిస్ట్రీని తప్పకుండా అమలులోకి తీసుకొస్తామని ఉద్ఘాటించారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన రాజ్‌నాథ్ పలు అంశాలపై మాట్లాడారు.
"ఎన్నికల్లో లబ్ధి కోసం కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంలేదు. మా మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే 35ఏ, 370 ఆర్టికల్స్‌ను రద్దు చేస్తామని చెప్పాం. భారత్‌ను శక్తిమంతంగా మార్చాలనుకుంటున్నాం. జాతీయ పౌర రిజిస్ట్రీని తప్పక అమలు చేస్తాం. పరిష్కారానికి ఎన్నో మార్గాలున్నా.. ఎన్ఆర్సీ విధానమే సరైనదని గుర్తించాం. ఇది ముస్లింలపై వ్యతిరేక చర్య అనుకోవడానికి లేదు. హిందూ ముస్లింలు అంటూ తేడాలేమీ లేవు. న్యాయం అందరికీ సమానంగా లభించాలి. ఇది నా మాటే కాదు. పార్టీ లక్ష్యమూ అదే."