2017 ఆగస్టు 22... చారిత్రక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ముమ్మారు తలాఖ్ విధానం చెల్లదని, అక్రమమని తేల్చిచెప్పింది. తలాఖ్ విషయంలో కేంద్రం చట్టం చేయాలని ఆదేశించింది.
2017 డిసెంబర్ 28... ముమ్మారు తలాఖ్‌ను శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
ఏడాది దాటింది. అయినా తలాఖ్ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందలేదు. మధ్యలో ఎన్నో నాటకీయ పరిణామాలు. బిల్లులో కొన్ని మార్పులు. మూడు సార్లు ఆర్డినెన్సులు.
ముమ్మారు తలాఖ్ విధానంతో ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందన్నది అన్ని ప్రధాన పార్టీల మాట. సుప్రీంకోర్టు తీర్పును అందరూ స్వాగతించారు. కానీ... సభలో మాత్రం ఎవరి దారి వారిదే.
ఎందుకిలా అంటే... ఎవరి కారణాలు వారివి.
"ముమ్మారు తలాఖ్ వంటి అమానుష సంస్కృతికి వ్యతిరేకంగా బిల్లు తెచ్చినప్పుడు నన్ను ఎన్ని మాటలన్నారు? ముమ్మారు తలాఖ్ బాధితులు, ఆ సంప్రదాయానికి భయపడుతున్న నా సోదరీమణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మాకు మద్దతు ఇవ్వండి. మా బలం పెంచండి. మీ భద్రతకు మాది భరోసా."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
"ముమ్మారు తలాఖ్ పేరుతో ఒక బిల్లు తీసుకువచ్చారు. మోదీ ముస్లిం మహిళలలకు పురుషులతో పోరాడే శక్తి ఇచ్చారనుకున్నాం. ఈ బిల్లు ఆమోదం పొందితే మహిళలు సాధికారత సాధిస్తారని ఆశించాం. కానీ... ముస్లిం పురుషులను జైల్లో పెట్టించడానికి, పోలీస్ స్టేషన్లో నిలబెట్టడానికి నరేంద్రమోదీ తయారు చేసిన మరో ఆయుధం ఇది. అందుకే మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ ముమ్మారు తలాఖ్ చట్టాన్ని రద్దుచేస్తుంది."
-సుస్మితా దేవ్, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
జనం మాటేంటి...?
ముమ్మారు తలాఖ్ చట్టం తెస్తే ముస్లిం మహిళలు తమకే మద్దతిస్తారని భాజపా నేతలు ఎప్పటినుంచో లెక్కలేసుకుంటున్నారు. ఇప్పుడు పరీక్షా సమయం. తలాఖ్ విషయంలో భాజపాపట్ల ముస్లిం మహిళల్లో ఏర్పడ్డ సానుకూలత... ఓట్లుగా మారుతుందా లేదా అన్నదే ప్రశ్న.
ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్. 2014లో అక్కడ ఉన్న 8 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ భాజపాదే విజయం. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కైరానా మాత్రం చేజారింది.
పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. ఓటర్ల సంఖ్య కోటిన్నర. అందులో 35శాతం మంది ముస్లింలే. వీరిలో మంది భాజపాకు ఓటేస్తారన్నది ఆసక్తికరం.