తెలంగాణ

telangana

ETV Bharat / elections

కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్​ - general elections

సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్​కు రంగం సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 95 నియోజకవర్గాలకు ఓటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్​

By

Published : Apr 18, 2019, 5:51 AM IST

Updated : Apr 18, 2019, 6:26 AM IST

రెండో విడత పోలింగ్​కు రంగం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల రెండో దశ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో ఓటింగ్​ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 లోక్​సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మొత్తం 15.79 కోట్ల మంది ఓటర్లు.. 1600 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సుమారు లక్షా 81 వేల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ.

కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్​

భారీ భద్రత....

రెండో దశ పోలింగ్​ కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్ర పోలీసులతో పాటు పెద్దసంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఈసీ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడనుంది.

బరిలో ప్రముఖులు...

రెండో విడత సార్వత్రిక ఎన్నికల బరిలో ప్రముఖులున్నారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్​, జుయేల్​ ఓరాంవ్​, సదానంద గౌడ, పొన్​ రాధాక్రిష్ణన్​లు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. వీరితో పాటు మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ, డీఎంకే నేతలు దయానిధి మారన్​, ఏ రాజా, కనిమొళిలు పోటీలో ఉన్నారు.

ఇతర ప్రముఖ కాంగ్రెస్​ నేతలు వీరప్ప మొయిలీ, రాజ్​ బబ్బర్​, నేషనల్​ కాన్ఫరెన్స్​ అధ్యక్షుడు ఫరూక్​ అబ్దుల్లా, భాజపా నుంచి హేమమాలిని రెండో విడతలో పరీక్షించుకుంటున్నారు.

తమిళనాట లోక్​సభతో పాటు శాసనసభకూ...

తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే, భాజపా, పీఎంకే, డీఎండీకేలు కూటమిగా ఉన్నాయి. కాంగ్రెస్​, లెఫ్ట్​ పార్టీలతో కలిపి డీఎంకే మరో కూటమిని ఏర్పరచి ఎన్నికల బరిలో నిలిచింది. ద్రవిడనాట దిగ్గజ నేతలు దివంగత జయలలిత, కరుణానిధి మరణానంతరం ఇక్కడ తొలిసారి లోక్​సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

తమిళనాడులో మొత్తం 39 నియోజకవర్గాలకు గానూ.. వెల్లూరు లోక్​సభ స్థానంలో ఎన్నిక రద్దుతో 38 సీట్లకు పోలింగ్​ జరగనుంది. వీటితో పాటు 18 శాసనసభ నియోజకవర్గాలకు ఉపఎన్నికల పోలింగ్​ నిర్వహించనున్నారు.

త్రిపుర లోక్​సభ స్థానానికి రెండో విడతలోనే ఎన్నిక నిర్వహించనున్నట్లు తొలుత షెడ్యూల్​లో పేర్కొన్న ఈసీ.. పోలింగ్​ తేదీని ఏప్రిల్​ 23కు మార్చింది. శాంతి భద్రతల సమస్య కారణంగా ఎన్నికను వాయిదా వేశారు.

కన్నడనాట 14....

28 లోక్​సభ నియోజకవర్గాలున్న దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో 14 స్థానాలకు పోలింగ్​ జరగనుంది. ఇవి ఎక్కువగా పాత మైసూరు ప్రాంతంలోనివే. జేడీఎస్​కు ఇక్కడ మంచి పట్టుంది.

మండ్య స్థానం నుంచి ప్రముఖులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్​ గౌడ, సినీ నటి సుమలత ఇక్కడ పోటీ చేస్తున్నారు. బెంగళూరు సెంట్రల్​ నుంచి సినీ నటుడు ప్రకాశ్​ రాజ్​ స్వతంత్ర అభ్యర్థిగా పరీక్షించుకుంటున్నారు.

మిగతా రాష్ట్రాలు...తమిళనాడులో 38 స్థానాలతో పాటు.. కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్​ప్రదేశ్​లో 8, అసోం, బిహార్​, ఒడిశాలో 5, ఛత్తీస్​గఢ్​, బంగాల్​లో 3, జమ్ము కశ్మీర్​లో 2, మణిపుర్​, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

  • మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్​ నేతలు అశోక్​ చవాన్​ నాందేడ్​, సుశీల్​కుమార్​ షిండే సోలాపుర్​లో పోటీ చేస్తున్నారు.
  • సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రాజ్​బబ్బర్​, హేమమాలినిలు ఉత్తర్​ప్రదేశ్​లో రెండో విడత ఎన్నికల బరిలో ఉన్నారు.
  • జమ్ముకశ్మీర్​లో శ్రీనగర్​, ఉధమ్​పుర్​ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

వీటితో పాటు ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​.. హింజిలి, బిజేపుర్​ స్థానాల్లో బరిలో ఉన్నారు. ఇక్కడ మావోల ప్రభావమున్న కంధమాల్​లో భారీ భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించనున్నారు.

మొత్తం ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మే 19న జరిగే తుది విడతతో ముగుస్తాయి. మే 23న కౌంటింగ్​ జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇదీ చూడండీ:ద్రవిడ రాజకీయాన్ని మార్చే పోరుకు సర్వం సిద్ధం

Last Updated : Apr 18, 2019, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details