ఎన్నికలు అంటేనే ప్రయోగాల సమాహారం. సమయం బట్టి, ప్రత్యర్థుల ఎత్తులకు అప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తుంటాయి పార్టీలు. ఇందులో భాగంగా కొత్త వ్యక్తులూ హఠాత్తుగా ప్రత్యక్షం అవుతుంటారు. అలానే భాజపా ఓ వ్యక్తిని తెరపైకి తెచ్చి సంచలనం సృష్టించింది. వారే మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసు నిందితురాలిగా జైలు జీవితం గడిపిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.
సరైన సందర్భంలో తెరపైకి..
భోపాల్.. భాజపా కంచుకోటల్లో ఒకటి. 8 పర్యాయాలుగా ఓటమన్నదే ఎరుగదు. ఈసారీ గెలుపుపై భాజపాకు అనుమానాలు లేవు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా దిగ్విజయ్ సింగ్ పేరు ప్రకటనతో కొత్త వ్యూహాలవైపు భాజపా మొగ్గు చూపింది. హిందుత్వం, ఆర్ఎస్ఎస్లను భాజపాకు ముడిపెట్టి విమర్శించటంలో డిగ్గీరాజాకు పెట్టింది పేరు. హిందూ, కాషాయ తీవ్రవాదమనే పదజాలంతో భాజపాను ఉటంకించేవారు.
హిందుత్వంపై ఐదేళ్ల కాలంలో తమపై వచ్చిన విమర్శలకు సమాధానంగా భాజపా ప్రయోగించిన అస్త్రమే సాధ్వి ప్రజ్ఞా సింగ్. భోపాల్ స్థానంలో సాధ్విని బరిలో దించడం అంటే ఒకే వేదికగా రెండు ప్రయోజనాల కోసమే. కంట్లో నలుసులా మారిన దిగ్విజయ్ ఓడించొచ్చు. రెండోది... సాధ్వి గెలుపుతో హిందుత్వంపై వస్తున్న విమర్శలను పటాపంచలు చేయొచ్చు. సాధ్వికి టికెట్‌తో రాష్ట్రవ్యాప్తంగా హిందూ ఓటర్లు భాజపా వైపు మళ్లుతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.