భారత్ భేరి: పటేళ్ల కోటలో కమలం వికసించేనా? గుజరాత్లో పాటీదార్లు బలమైన వర్గంగా ఉన్నారు. మొదటి నుంచి వారి మద్దతు భాజపాకే. 2017లో పరిస్థితి మారింది. రిజర్వేషన్ల కోసం పాటీదార్లు ఉద్యమబాట పట్టారు. హార్దిక్ పటేల్ నేతృత్వంలో ఆందోళనలు చేశారు. ఆ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఉద్యమ ప్రభావం కనిపించింది.
శానసనభలో అలా.. మరి ఇప్పుడు
పాటీదార్ల ఉద్యమ ప్రభావం ఉన్నా.. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గట్టెక్కింది భాజపా. అయితే ఆ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న సౌరాష్ట్రలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సౌరాష్ట్రలోని 7 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 49 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 30 గెలుపొందింది. భాజపా కేవలం 18 గెలిచింది. ఎన్సీపీ ఒక స్థానం కైవసం చేసుకుంది.
పాటీదార్ల ఉద్యమనేత హార్దిక్ పటేల్ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇదే భాజపా నేతల గుండెల్లో గుబులు రేపుతోంది.
"ఉద్యమం పాత మాట"
పాటీదార్ల రిజర్వేషన్ల ఉద్యమం ఇప్పుడు అసలు ఎన్నికల అంశమే కాదంటోంది భాజపా. అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పించిన తమకే.. పటేళ్ల మద్దతు ఉంటుందన్నది కమలదళం వాదన.
రైతులే లక్ష్యం...
గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో చాలామంది పాటీదార్లు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. కర్షకులకు ఏటా రూ.6 వేలు సాయం నగదు బదిలీ ద్వారా అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం తమకు లాభిస్తుందని భాజపా నేతలు లెక్కలేసుకుంటున్నారు.
రైతులకిచ్చిన హామీల అమలులో భాజపా ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రచారం సాగిస్తోంది.
"భాజపా ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా లేరు. తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షాభావంతో రైతులు ఇబ్బందులు పడితే ప్రభుత్వం సాయం అందించలేదు."
-అర్జున్ సోసా, కాంగ్రెస్ అమ్రేలీ జిల్లా అధ్యక్షుడు
"పంటల బీమా పథకం సరిగ్గా అమలు కావట్లేదు. బీమా ప్రీమియం చెల్లించినా గ్రామాల్లో రైతులకు క్లెయిమ్ సొమ్ము అందట్లేదు. కరవు ప్రాంతాల్లో మాత్రం రూ.11,600 సాయం అందించారు."
-భరత్ పడ్సాలా, కేరళ గ్రామ రైతు, అమ్రేలీ జిల్లా
భాజపా ప్రభుత్వం సౌరాష్ట్రలో రూ.4000 కోట్లు విలువైన పల్లీ కుంభకోణానికి పాల్పడిందన్న ఆరోపణలను ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తోంది కాంగ్రెస్.
యువతపైనే భాజపా ఆశలు...
2014లో గుజరాత్‌లోని 26 లోక్‌సభ సీట్లను క్లీన్‌స్వీప్ చేసింది భాజపా. ఇప్పుడు యువత మద్దతుతో ఆ సీట్లు నిలబెట్టుకోగలమని భావిస్తోంది కమలదళం.
"గత అసెంబ్లీ ఎన్నికల్లో... యువత మాకు వ్యతిరేకంగా ఉన్నందున మేం ఇబ్బందిపడ్డాం. అసెంబ్లీలో మా సీట్లు తగ్గాయి. ఇప్పుడు యువత మా వైపున్నారు. మోదీకి మద్దతిస్తున్నారు. జాతీయవాదం వైపు నిలుస్తున్నారు. గుజరాత్లో ఒక్క లోక్‌సభ సీటు కూడా కోల్పోం. కొంతకాలమే కులాన్ని తప్పుదోవ పట్టించగలం. ఎప్పటికీ అది సాధ్యంకాదు. పాటీదార్ల ఆందోళన ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రేరేపించిన ఉద్యమం."
-మన్సుఖ్ మండావియా, కేంద్ర మంత్రి
ఫిరాయింపులు...
సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొందరు జిల్లా స్థాయి నేతలు ఇటీవలే భాజపాలో చేరారు. ఇవన్నీ మరోమారు క్లీన్ స్వీప్ చేసేందుకు ఉపకరిస్తాయని కమలదళం ఆశిస్తోంది.
గుజరాత్‌లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈనెల 23న పోలింగ్. మే 23న ఫలితం.
ఇదీ చూడండి:హ్యాష్‌ట్యాగ్‌ల యుద్ధంలో విజేత ఎవరో..?