తెలంగాణ

telangana

ETV Bharat / elections

భారత్​ భేరి: భాజపా దూసుకెళ్తోంది కానీ... - naveen patnaik

రెండు​ ఇంజిన్ల ప్రభుత్వం​..! ఒడిశాలో భాజపా ప్రచార సభల్లో బాగా వినిపిస్తున్న మాట. కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ అధికారమిస్తే ప్రగతి రథాన్ని రెట్టింపు వేగంతో పరుగులు పెట్టిస్తామని పదేపదే చెబుతున్నారు. ఈ లక్ష్యం నెరవేరుతుందా? విశ్లేషకుల మాటేంటి?

ఒడిశా పీఠం ఎవరికీ?

By

Published : Apr 6, 2019, 6:41 PM IST

ఒడిశా పీఠం ఎవరికీ?

ఒడిశాలో 19 ఏళ్లుగా బిజూ జనతాదళ్​దే ఏకచ్ఛత్రాధిపత్యం.​ ఆ పార్టీ పునాదులు కదిల్చేందుకు జాతీయ పార్టీలు ఎన్నిసార్లు ప్రయత్నించినా... ఫలించలేదు. ఇప్పుడు కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ పాగా వేసేందుకు మరోమారు అవకాశం వచ్చింది. లోక్​సభతో పాటు ఒడిశా శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.

సుదీర్ఘ పాలనతో ప్రభుత్వంపై ఒకింత వ్యతిరేకత సాధారణం. ఇదే అవకాశంగా చెలరేగిపోతోంది భాజపా. పటిష్ఠ వ్యూహాలు, పదునైన విమర్శలతో ముందుకు సాగుతోంది.

"19 ఏళ్లు అంటే చిన్న సమయం కాదు. ఆ సమయంలో ఓ విద్యార్థి చదువు కాలం పూర్తవుతుంది. అంత సమయం మీరు బీజేడీకి అధికారమిచ్చారు. కానీ ఇప్పుడు మార్పునకు అవకాశం వచ్చింది. కొత్త ఉషోదయం కోసం ఏప్రిల్ 11న కమలం పువ్వును స్పర్శించి రెండు ఇంజిన్ల ప్రభుత్వాన్ని ఏర్పరచాలి."
- నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

బిజూ జనతా దళ్​ నుంచి కీలక నేతల్ని దిగుమతి చేసుకోవటంలో భాజపా విజయం సాధించింది. వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని నరేంద్రమోదీతో ప్రచారం చేయిస్తోంది. కమల వికాసమే ధ్యేయంగా అభివృద్ధి మంత్రం జపిస్తోంది. ఒడిశా ప్రగతి రథాన్ని రెట్టింపు వేగంతో పరుగులు పెట్టించేందుకు కేంద్రంలో, రాష్ట్రంలో భాజపాకు పట్టంకట్టాలని కోరుతూ ఓటర్లకు చేరువవుతోంది.

ఇవీ చూడండి:

"పేద రైతులకు శత్రువులా తయారైంది బీజేడీ. 12 కోట్ల మంది రైతులకు రూ.75 వేల కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇందులో మీ పేర్లు లేవు. కారణం ఇక్కడి ప్రభుత్వం. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య బీజేడీ గోడ కట్టేసింది. ఇదే తరహాలో ఆయుష్మాన్ భారత్​ను తిరస్కరించింది. రూ.5 లక్షల ఆరోగ్య సాయానికి అడ్డుపడుతోంది."
- నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

వలసల రాజకీయం

విపక్షాల వ్యూహాలతో అప్రమత్తమయ్యారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ప్రజావ్యతిరేకతను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలు రచిస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లో 33శాతం టికెట్లను మహిళలకే కేటాయిస్తామన్న ప్రకటనతో ఆ వర్గం ఓట్లపై గురిపెట్టారు.
మహిళల కోటా నిర్ణయం పార్టీ పరంగా బీజేడీకే నష్టం కలిగించింది. టికెట్ రాదన్న భావనతో భాజపా గూటికి చేరారు కొందరు కీలక నేతలు. భాజపా చాకచక్యంగా వ్యవహరించి బీజేడీకి ప్రధాన పోటీదారుగా నిలిచింది.

ఇవీ చూడండి:

వెనుకంజలో కాంగ్రెస్

ఝార్ఖండ్​ ముక్తి మోర్చాతో జట్టుకట్టింది కాంగ్రెస్. అయినా... బీజేడీ, భాజపాతో పోల్చితే వెనుకంజలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. భాజపా, బీజేడీ ప్రత్యర్థుల్లా కనిపిస్తున్నా... అంతర్గత ఒప్పందాలు ఉన్నాయని ఆరోపిస్తోంది. ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల ముందు నిలిచే ప్రయత్నం చేస్తోంది.

అనుమానమే..!

వ్యూహాలు, ప్రచారాల్లో భాజపా దూకుడుగా ఉన్నా... ప్రజాకర్షణగల నేతల విషయంలో ఆ పార్టీ వెనుకబడి ఉందన్నది రాజకీయ నిపుణుల మాట. ధర్మేంద్ర ప్రధాన్, వైజయంత్ పాండా, సంబిత్ పాత్రా మినహా ప్రభావం చూపే నేతలు లేరన్నది వారి విశ్లేషణ.

"భాజపా, బీజేడీ నుంచి నేతలు అటూఇటూ మారుతున్నారు. ఇందుకు కారణం సైద్ధాంతిక విభేదాలు కాదు. టికెట్లు దక్కలేదన్న కారణంతోనే జరుగుతోంది. ఇదే పార్టీలో ఉంటే ఓడిపోతామన్న భయంతోనే బయటకు వచ్చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే భాజపా మెరుగుపడే అవకాశం ఉంది. పార్టీలోకి వలసలు, కేంద్ర ప్రభుత్వంలో ఉండటం, మోదీ ప్రచారం, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, రూ.20వేల కోట్లతో రైల్వే పనులు చేయించడం వంటివి భాజపాకు లాభించే అవకాశం ఉంది. భాజపా పుంజుకునే అవకాశముంది కానీ బీజేడీని గద్దె దించకపోవచ్చు. కాంగ్రెస్ మూడో స్థానంలో నిలుస్తుంది."
- సీకే నాయుడు, సీనియర్ పాత్రికేయుడు

గత ఎన్నికల్లో 21 లోక్ సభ స్థానాలకు 20 సొంతం చేసుకుంది బీజేడీ. అసెంబ్లీలో 147 స్థానాలకు 117 కైవసం చేసుకుంది. ఇంతటి ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి భాజపా చేస్తున్న ప్రయత్నాలు ఏమేర ఫలిస్తాయో మే 23న తేలనుంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details