తెలంగాణ

telangana

ETV Bharat / elections

భారత్​ భేరి: ఓటెవరికి... దేశానికా? నగరానికా?? - uttarpradesh

2014లో నరేంద్రమోదీ గెలిచిన నియోజకవర్గం. అదీ 5.7 లక్షల ఓట్ల ఆధిక్యంతో. ఈసారి లెక్క మారింది. అక్కడ పోటీలో మోదీ లేరు. మరి గుజరాత్​ వడోదర ఓటర్లు ఏం చేస్తారు? భాజపా 'జాతీయవాద' అజెండాకు జైకొడతారా? లేక 'మీ సమస్యలు పరిష్కరిస్తాం' అంటున్న కాంగ్రెస్​ 'పక్కా లోకల్​' ప్లాన్​ను సమర్థిస్తారా??

భారత్​ భేరి: ఓటెవరికి... దేశానికా? నగరానికా??

By

Published : Apr 19, 2019, 8:35 PM IST

భారత్​ భేరి: ఓటెవరికి... దేశానికా? నగరానికా??

వడోదర, వారణాసి.... 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేసిన 2 నియోజకవర్గాలు. రెండు చోట్ల భారీ విజయం. వడోదరలో కాంగ్రెస్​ అభ్యర్థి మధుసూదన్​ మిస్త్రీపై 5లక్షల 70వేల ఓట్ల ఆధిక్యం సాధించారు మోదీ. కానీ... వారణాసి ఎంపీగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారాయన. వడోదరకు రాజీనామా చేశారు. మోదీ స్థానంలో భాజపా తరఫున రంజన్​బెన్​ భట్​ గెలిచారు.

ఐదేళ్లు గడిచాయి. మరోమారు రంజన్​బెన్​నే బరిలోకి దింపింది భాజపా. కాంగ్రెస్​ అభ్యర్థి ప్రశాంత్​ పటేల్. ఇప్పుడు వీరిద్దరూ పోటాపోటీగా సాగిస్తున్న ప్రచారంతో... ఓటర్లు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.

జాతీయవాదమే భాజపా మంత్రం...

2014లో భాజపా ప్రచార మంత్రం 'నరేంద్ర మోదీ'. గత ఎన్నికల్లో వడోదరలో గెలిచింది, గెలిపించింది ఆయనే. ఈసారి మాత్రం జాతీయవాదాన్ని నమ్ముకుంది కమలదళం.

పాకిస్థాన్​కు బుద్ధి చెప్పడం కోసం, దేశ భద్రత కోసం భాజపాకు ఓటేయాలని రంజన్​బెన్​ భట్​ ఎన్నికల ప్రచారంలో కోరుతున్నారు. సైనికుల్లో నైతికత పెంపొందిస్తూ... తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు మద్దతివ్వాలని పిలుపునిస్తున్నారు.

స్థానిక సమస్యలే హస్తం అస్త్రాలు...

కాంగ్రెస్ అభ్యర్థి ప్రశాంత్ పటేల్ మాత్రం... తనను గెలిపిస్తే స్థానిక సమస్యలు తీరుస్తానంటున్నారు. నిరుద్యోగం, భారమవుతున్న ఉన్నత విద్య, ఇతర సమస్యలు పరిష్కరిస్తానంటున్నారు.

"ప్రజలు అందుబాటు ఖర్చులో మెరుగైన విద్య లాంటి కనీస అవసరాలు తీరుస్తారనే మనకు ఓటు వేస్తారు. గత 23 ఏళ్లుగా భాజపా ఈ పురపాలక సంస్థలో అధికారంలో ఉన్నా చేసిందేమీ లేదు. జాతీయవాదం కేవలం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే."
-ప్రశాంత్ పటేల్, కాంగ్రెస్ అభ్యర్థి, వడోదర

కాంగ్రెస్ విమర్శలను భాజపా తిప్పికొట్టింది.

"ఇవేవీ స్థానిక సంస్థల ఎన్నికలు కాదు. పార్లమెంటు ఎన్నికలని కాంగ్రెస్​ అర్థం చేసుకోవాలి. స్థానిక సమస్యల పరిష్కారంలో మేము విఫలమైతే 1995 నుంచి పురపాలక సంస్థ ఎన్నికల్లో ఎందుకు వరుసగా విజయం సాధిస్తాం?
లోక్​సభ ఎన్నికలు ఎప్పుడూ జాతీయ అంశాలపైనే జరుగుతాయి. నగరంలో చిన్న పైపు లీకైనా కాంగ్రెస్​ నానా రాద్ధాంతం చేస్తుంది. చెప్పేందుకు ఏమీ లేకనే వారు ఇలా చేస్తున్నారు."
-ముకేశ్​ దీక్షిత్​, వడోదర భాజపా అధికార ప్రతినిధి

అటా...? ఇటా...??

జాతీయవాదం ఓవైపు... స్థానిక సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ మరోవైపు... ఎవరికి జైకొట్టాలన్న సందిగ్ధంలో ఉన్నారు వడోదర ఓటర్లు.

"జాతీయవాదం విషయంలో భాజపాకే నా ఓటు. కానీ ఎవరికి ఓటేయాలో ఇంకా అర్థం కావడంలేదు. భాజపా, మోదీ చాలా బాగా పనిచేస్తున్నారు. కానీ మా పిల్లలకు అందుబాటు ఖర్చులో నాణ్యమైన విద్య కావాలి."
-రోనక్​ షా, ప్రైవేటు సంస్థ ఉద్యోగి

"భాజపా విజయం నల్లేరుపై నడక. ఎందుకంటే పట్టణ ఓటర్లంతా భాజపాకే మద్దతిస్తారు. ఇక్కడ రోడ్లు బాగోకపోవడం పెద్ద సమస్య కాదు. భాజపా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. పైవంతెనలు నిర్మించింది. పట్టణ ఓటర్ల మద్దతు ఎప్పుడూ భాజపాకే."
-జిగర్ ప్రజాపతి, వడోదర వాసి

వడోదరలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే తండాల్జా ప్రాంతానికి చెందిన 27ఏళ్ల యువకుడి వాదన మరోలా ఉంది. "కాంగ్రెస్​ ప్రజల సమస్యల్ని ప్రస్తావిస్తోంది. మేము సైన్యం వెంటే ఉంటాం. కానీ.. నా లాంటి ఎంతోమంది సరైన ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కొత్త పరిశ్రమలు ఏమీ రావడంలేదు. భాజపా జాతీయవాదం సూత్రంతో ఏకీభవించని వారు ఎందరో ఉన్నారు" అని అన్నాడు. పేరు చెప్పేందుకు అతడు ఇష్టపడలేదు.

18లక్షల మంది తీర్పు...

18లక్షల మంది ఓటర్లున్న వడోదర సహా గుజరాత్​లోని మొత్తం 26 లోక్​సభ నియోజకవర్గాలకు ఈనెల 23న పోలింగ్​. మే 23న ఫలితం.

ఇదీ చూడండీ:సాధ్వి ప్రజ్ఞ సింగ్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

ABOUT THE AUTHOR

...view details