తెలంగాణ

telangana

ETV Bharat / elections

కాషాయదళ 'కాకీ ఎన్నికల' వ్యూహం! - congress

'దేశ భద్రత' ఇప్పుడు యావద్దేశం మార్మోగుతున్న పదం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాజపా వాడుతున్న ప్రధాన ప్రచారాస్త్రం. పుల్వామా ఘటన అనంతరం భారత్​ చేపట్టిన లక్షిత దాడుల తర్వాత దేశ రక్షణ మాతోనే సాధ్యమని నినదిస్తోంది భాజపా. ఇంతకీ దేశ భద్రతకు వచ్చిన ముప్పు ఏంటి? నరేంద్ర మోదీ ఈ అంశంతో ఎన్ని ఓట్లు సంపాదిస్తారు?

కాషాయదళ 'కాకీ ఎన్నికల' వ్యూహం!

By

Published : Apr 5, 2019, 6:04 AM IST

కాషాయదళ 'కాకీ ఎన్నికల' వ్యూహం!

దేశ భద్రత... ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ట్రెండింగ్​ వర్డ్​. కమలదళం పదునైన అస్త్రంగా వాడుతున్న అంశం. దేశ సమగ్రత, భద్రత తమతోనే సాధ్యమని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది భాజపా. ఎన్నికల్లో రఫేల్ కుంభకోణంపై విమర్శలతో ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి రావాలని గత కొద్ది రోజుల వరకు కాంగ్రెస్ ప్రయత్నించింది. భాజపా అంతకుమించిన వజ్రాయుధం 'దేశ భద్రత' పేరుతో ప్రజల ముందుకొచ్చింది. దేశ రక్షణ, సమగ్రతను మోదీ మాత్రమే కాపడాతారంటూ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది భాజపా.

సభల్లో ప్రధాన అస్త్రం ఇదే...

భాజపా నాయకులు కేంద్ర పథకాలు, మైబీ చౌకీదార్, దేశ భద్రత వంటి వాటిని ప్రచార అస్త్రాలుగా వాడుతున్నారు. దేశ భద్రతను ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా యువతను తమ వైపు తిప్పుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు పార్టీ నేతలు.

గత ఐదేళ్లలో తీవ్రవాద దాడులు తగ్గాయి: భాజపా

గత ప్రభుత్వాలతో పోల్చితే తమ పాలనలో తీవ్రవాద దాడులు తగ్గాయని.. ఎక్కువమంది ఉగ్రవాదులు హతమైనట్లు కమలనాథులు చెబుతున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక లక్షిత దాడులు చేసి దేశ భద్రతలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదన్న సంకేతాలు జనాల్లోకి పంపుతున్నారు.

కలిసి వచ్చిన లక్షిత దాడులు...

ఇటీవల బాలాకోట్ వైమానిక దాడులు తమకు మరింత కలిసివస్తాయని భాజపా భావిస్తోంది. కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ విభజనవాదులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని నేతలు ప్రచారం చేస్తున్నారు.

ప్రతిపక్షాల విమర్శలే అస్త్రాలుగా...

బాలాకోట్ దాడి తర్వాత ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలను భాజపా నేతలు తమ ప్రచారంలో వాడుకుంటున్నారు. 'వైమానిక దాడులు నిజంగా జరిగాయా?' అంటూ దేశ సైనిక సామర్థ్యాన్ని ప్రశ్నించే నేతలతో దేశ భద్రత ఎలా సాధ్యమంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మోదీ ప్రచార సభల్లో కాంగ్రెస్​ పాకిస్థాన్​ సానుభూతి పార్టీ అంటూ విమర్శిస్తున్నారు.

ఎన్​ఆర్​సీతోనూ లాభమే...

ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాటుదారులపై భాజపా అనుసరించిన కఠిన వైఖరి తమకు లాభం చేకూర్చుతుందని కమలదళం భావిస్తోంది. అక్రమ వలసదారులతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భాజపా ఎన్నికల సమరం మొదటి నుంచే పదేపదే చెబుతోంది. మళ్లీ అధికారంలోకి రాగానే జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్​సీ) తీసుకొస్తామని అంటోంది. అసోంలో చేపట్టిన ఈ ప్రక్రియతో ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి పట్టు సాధిస్తామని కమలదళం ఆశిస్తోంది.

వామపక్ష తీవ్రవాదంపై పోరు మాతోనే సాధ్యం...

బంగాల్​లోనూ దాదాపు లక్షమంది అక్రమ వలసదారులు ఉన్నారంటూ భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. దేశ భద్రతకు మోదీతోనే భరోసా అన్న నినాదం బంగాల్​లో తమకు ఓట్లు పడేలా చేస్తుందని భాజపా భావిస్తోంది.
వామపక్ష తీవ్రవాదం దేశ అంతర్గత భద్రతకు ప్రమాదకరమని... దానిపై కఠిన చర్యలు తీసుకునే సత్తా భాజపాకే ఉందని నేతలు ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్​ స్పందన...

దేశ భద్రత పేరుతో భాజపా చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ ఖండిస్తోంది. భాజపా హయాంలోనే ఎక్కువ మంది జవాన్లు చనిపోయారని విమర్శిస్తోంది. దేశ భద్రతపై భరోసా తిరిగి కాంగ్రెస్​ అధికారంలోకి వస్తేనే ఉంటుందని రాహుల్ గాంధీ హామీ ఇస్తున్నారు.
మొత్తంగా దేశ భద్రత ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆయుధంగా మారింది. ఈ అంశంతో ఎవరికి లాభం జరుగుతుందో మే 23న తేలనుంది.

ఇవీ చూడండి:కాంగ్రెస్​ 'మెరుపు దాడిపై' దేశం మాటేంటి..?

ABOUT THE AUTHOR

...view details