2019 ఎన్నికల కురుక్షేత్రం చివరి అంకానికి చేరుకుంది. మే 19తో చివరిదైన ఏడో దశ పోలింగ్ ముగియనుంది. ఓటింగ్ ముగిసిన మరుక్షణం దేశం దృష్టి మొత్తం టీవీలపైనే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. ఆ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తుంది, ఈ పార్టీకి డిపాజిట్లు గల్లంతే అంటూ సాగే విశ్లేషణపూర్వక ఎగ్జిట్ పోల్స్ అంటే సామాన్య ఓటరు నుంచి బడా నాయకుల వరకు అందరికీ ఆసక్తే.
ప్రధానమంత్రి ఎవరు అవుతారు...? మరోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిదే అధికారమా? లేక కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందా? అంటూ సాగే విశ్లేషణలు ఎన్నికల వేడిని తారస్థాయికి చేర్చుతాయి. కాంగ్రెస్ విజయ తీరాలకు చేరుతుందా? యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమిదే సింహాసనామా? అంటూ టీవీల్లో విశ్లేషణలు మార్మోగిపోతాయి.
వీటన్నింటిపై క్షేత్ర స్థాయిలో ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్ ద్వారా మీడియా ఛానళ్లు సర్వేలు నిర్వహిస్తాయి. ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిలో కొన్నిసార్లు ఇవి సఫలమయ్యాయి. మరికొన్ని సార్లు ఘోరంగా విఫలమయ్యాయి.
2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సునామీ సృష్టించిన ఏడాది తర్వాత దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాజపా, ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ కొదమ సింహాల్లా గర్జించాయి. మోదీ ఏడాది పాలనకు, దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ బలానికి, 15 ఏళ్ల పాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్ పట్ల ప్రజాభిప్రాయానికి ఈ ఎన్నికలు అద్దం పడతాయని అందరూ అంచనా వేశారు.
70 అసెంబ్లీ స్థానాలు ఉన్న దిల్లీలో ఆప్ 40-45 సీట్ల వరకు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఆప్ 70 సీట్లలో 67 గెలిచి చరిత్ర సృష్టించింది.
బిహార్లోనూ అదే కథ
2015లో బిహార్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ప్రధాన పోటీ భాజపా..., జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహాకూటమి మధ్యే.