'గోరఖ్‌పుర్ తిరిగి భాజపా సొంతమయ్యేనా?' భాజపా కంచుకోట గోరఖ్‌పుర్‌లో కాషాయదళాన్ని మట్టికరిపించిన చరిత్ర సమాజ్‌వాదీ పార్టీది. యోగి ఆదిత్యానాథ్ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన నియోజకవర్గంలో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ 21వేల మెజార్టీతో గెలుపొందారు. నేడు ప్రవీణ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఎవరీ ప్రవీణ్ కుమార్ నిషాద్?
ఉత్తర్‌ప్రదేశ్‌లో 'నిషాద్ పార్టీ' వ్యవస్థాపకులు సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ కుమార్. 2016లో రాష్ట్రంలోని నిషాద్, కేవత్, బింద్ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం పార్టీని ఏర్పాటు చేసారు. వెనుకబడిన కులాల జాబితాలో వీటిని చేర్చాలని ఉద్యమిస్తున్నారు.
2018లో యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గెలిచిన గోరఖ్‌పుర్ లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తులో భాగంగా ప్రవీణ్ కుమార్ నిషాద్కు ఎస్పీ పార్టీ నుంచి టికెటిచ్చారు. ఆ ఫలితాల్లో ఘన విజయం సాధించి భాజపా కంచుకోటను బద్దలు కొట్టారు ప్రవీణ్ కుమార్ నిషాద్.
ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎస్పీ గుర్తుపైనే పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్... ప్రవీణ్ కుమార్‌కు కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. నిషాద్ పార్టీ.. గుర్తుపైనే పోటీ చేస్తానని ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ మహాకూటమి నుంచి గత వారమే బయటకు వచ్చారు.
అఖిలేష్ స్పందన
గోరఖ్‌పూర్‌లో గతేడాది జరిగిన ఉపఎన్నికల్లో ప్రజలు ఎస్పీ, బీఎస్పీ మద్దతుకు ఓట్లేశారు.. కానీ ప్రవీణ్ నిషాద్‌ను చూసి కాదని అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం భాజపా ఓటమి చెందే ఒప్పందం చేసుకుందని ట్వీట్ చేశారు. గోరఖ్‌నాథ్ మఠాధిపతి(యోగి ఆదిత్యానాథ్) నుంచి ప్రసాదం(డబ్బు) అందుకునేందుకే ప్రవీణ్ నిషాద్ భాజపా కండువా కప్పుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రభుత్వ విధానాలపై నమ్మకం: నడ్డా
ప్రవీణ్ కుమార్ నిషాద్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తూ జేపీ నడ్డా.. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మోదీ ప్రభుత్వంపై సానుకూల దృక్పథమే నిషాద్‌ను భాజపాలో చేరేలా చేశాయన్నారు. నిషాద్ గోరఖ్‌పుర్‌లో ప్రభావవంతమైన వ్యక్తి అని కితాబిచ్చారు.
ప్రస్తుతం గోరఖ్‌పుర్ లోక్‌సభ స్థానానికి భాజపా ఇంకా ఏ అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రవీణ్ కుమార్‌కు త్వరలోనే కాషాయపార్టీ ఈ సీటును కేటాయించే అవకాశాలున్నాయి
ఇవీ చూడండి:యూపీలో భాజపా 'రాజకీయ ఇంజినీరింగ్'