తెలంగాణ

telangana

ETV Bharat / elections

దేశానికి ప్రమాదమా? స్వేచ్ఛకు విఘాతమా??

పేదలకు ఏడాదికి రూ.72వేలు సాయం. 22 లక్షల ఉద్యోగాల భర్తీ. మెరుగైన విద్య, వైద్యం... ఇలా కాంగ్రెస్​ మేనిఫెస్టోలో హామీలెన్నో. రాజకీయ చర్చ జరుగుతున్నది మాత్రం రెండింటిపైనే. ఒకటి రాజద్రోహం చట్టం రద్దు. రెండు... ఏఎఫ్​ఎస్​పీఏ సవరణ. ఎందుకిలా? ఆ చట్టాల్లో ఏముంది? కాంగ్రెస్​ చెప్పినట్లు చేస్తే ఏమవుతుంది?

CONGRESS

By

Published : Apr 5, 2019, 6:25 PM IST

దేశానికి ప్రమాదమా? స్వేచ్ఛకు విఘాతమా??

కాంగ్రెస్​ మేనిఫెస్టోపై భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా రెండు వివాదాస్పద చట్టాలపై కాంగ్రెస్​ హామీ ఇవ్వడం మరింత దుమారం రేపింది. బ్రిటీష్​ కాలం నాటి రాజద్రోహం​ చట్టం రద్దు, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్​ఎస్​పీఏ) సవరణ వంటి హామీలను కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది.
ఈ చట్టాల్లో ఏముంది?

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం...

బ్రిటీష్‌ పాలకులు 1942లో 'క్విట్‌ ఇండియా' ఉద్యమాన్ని అణచివేయడానికి సాయుధ బలగాలకు విశేష అధికారాలు కల్పిస్తూ ఒక ఆర్డినెన్సు తీసుకొచ్చారు. స్వాతంత్య్రానంతరం అప్పటి అవిభక్త అసోంలోని నాగాలాండ్‌లో తలెత్తిన వేర్పాటు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఈ ఆర్డినెన్సును అస్త్రంగా మార్చుకున్నారు పాలకులు. అందులో కొన్ని మార్పులు చేసి 1958 సెప్టెంబరు 11న 'సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం' ఆమోదించారు.

చట్టంలో ముఖ్యాంశాలు...

⦁ శాంతిభద్రతలను కాపాడేందుకు సాయుధ బలగాలకు అపరిమిత అధికారాలు.

⦁ అనుమతి లేకుండా ఇళ్లు తనిఖీ చేయడం, ఐదుగురు వ్యక్తులు గుమికూడినా కాల్పులు జరిపే అధికారం.

⦁ వారెంట్​ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు.

⦁ సాయుధ బలగాలపై విచారణకు కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి.

ఏఎఫ్​ఎస్​పీఏ కొన్నిచోట్ల పౌర హక్కుల ఉల్లంఘనకు కారణం అవుతుందన్నది ప్రజాసంఘాల ఆరోపణ.

రాజద్రోహం చట్టం...

భారత శిక్షాస్మృతిలోని 124 ఏ సెడిషన్ చట్టం ప్రకారం మాటలు, రాతలు, సైగల ద్వారా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి శత్రుత్వాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించినా, ప్రేరేపించినా వారికి జరిమానా, జీవిత ఖైదు విధించే వీలుంది.

బ్రిటీష్ హయాం నాటి ఈ చట్టాన్ని దేశంలో రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు అధికారపక్షం ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుందని ఉద్యమకారులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టం కింద అరెస్టయిన దాఖలాలు ఉన్నాయి. విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ అరెస్టయింది ఈ చట్టం కిందనే. ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్​ ప్రకటించడం ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపింది.

భాజపా ధ్వజం...

వివాదాస్పద చట్టాల రద్దుపై కాంగ్రెస్​ హామీలను అధికార పక్షం తీవ్రంగా తప్పుబడుతోంది. దేశద్రోహానికి పాల్పడితే నేరం కాదా అని ప్రశ్నిస్తోంది. ఇలాంటి చర్యలతో కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది భాజపా.

"కాంగ్రెస్​ ఓ మోసాల పత్రాన్ని విడుదల చేసింది. ఆ పత్రంలో దేశ సాయుధ బలగాల మనో బలాన్ని దెబ్బతీసే, వారి ప్రత్యేక అధికారాలను నీరుగార్చే హామీలిచ్చింది. జమ్ముకశ్మీర్, కొన్ని హింసాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలకు ఉన్న విశేష అధికారాలను కాలరాస్తామని కాంగ్రెస్​ చెబుతోంది. మన వీర జవాన్లను తీవ్రవాదులు, అల్లరిమూకల ముందు శక్తిహీనులను చేయాలనుకుంటోంది. వారి చేతులను కట్టేయాలనుకుంటోంది. ఇది ఎలాంటి ఆలోచన? "

-నరేంద్ర మోదీ, ప్రధాని

దీటుగా కాంగ్రెస్...

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గట్టిగా సమర్థించుకుంటోంది కాంగ్రెస్​. ఏఎఫ్​ఎస్​పీఏ సవరణ హామీని తప్పుబడుతున్న భాజపా... ఆ చట్టాన్ని త్రిపుర, మేఘాలయ, అరుణాచల్​ప్రదేశ్​లో ఎందుకు ఉపసంహరించిందని ప్రశ్నిస్తోంది.

"కశ్మీరులో ప్రస్తుతమున్న పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేదు. మీ దగ్గర చట్టం ఉంది. దానిని మీరు ప్రయోగిస్తున్నారు కదా. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నా. కశ్మీరులో ప్రస్తుతం ఈ పరిస్థితి ఎందుకు ఉంది? కశ్మీరు సమస్యకు మేము పరిష్కారం ఆలోచిస్తున్నాం. మీకు పరిష్కారం అవసరం లేదు."

రాజద్రోహం చట్టాన్ని దుర్వినియోగం చేశారు, చేస్తున్నారు. ఎందుకంటే వారి ఆలోచనా విధానం బ్రిటీషు వారికి దగ్గరగా ఉంటుంది. అన్ని దేశాల్లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. అమాయకులు, తప్పు చేయని వారు ఈ చట్టం ద్వారా బాధపడకూడదని మేము కోరుకుంటున్నాం."

- కపిల్​ సిబల్, కాంగ్రెస్ సీనియర్​ నేత

రాజద్రోహం చట్టం, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం విషయంలో ఎవరి వాదనలు వారివి. ఇందులో ప్రజలు ఎవరిని విశ్వసిస్తారో మే 23న తేలనుంది.

ఇదీ చూడండి: నాకు ఎప్పుడో పెళ్లైపోయింది: రాహుల్​ గాంధీ

ABOUT THE AUTHOR

...view details