తెలంగాణ

telangana

ETV Bharat / crime

MLC Ananta Udaya Bhaskar : మన్యం అడ్డాగా 'అనంత' అక్రమాలు - YSRCP MLC driver murder case updates

MLC Ananta Udaya Bhaskar : ఎస్సీ యువకుడు, మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గిరిజనులు ఎక్కువగా ఉండే రంపచోడవరం మన్యంలో ఓ నియంతలా వ్యవహరించేవాడని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో దొంగ డీ-పట్టాలతో కోట్ల రూపాయల మోసం సహా అనేక నేరాల్లో ఉదయభాస్కర్‌ కీలక నిందితుడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

MLC Ananta Udaya Bhaskar
MLC Ananta Udaya Bhaskar

By

Published : May 26, 2022, 7:06 AM IST

MLC Ananta Udaya Bhaskar : ఎస్సీ యువకుడు, మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌... రంపచోడవరం ఏజెన్సీలో నియంతలా వ్యవహరించేవాడన్న విషయం ఇప్పుడు మన్యం దాటి అంతటా వినిపిస్తోంది. నియోజకవర్గంలో అర్హులైన గిరిజనులున్నా వారికి పదవులు దక్కనీయకుండా తన సామాజికవర్గానికే కట్టబెట్టేవాడని, మాట విననివారిని ప్రలోభపెట్టో.. బెదిరించో దారికి తెచ్చుకునేవాడని పలువురు చెబుతున్నారు. తన అనుచరులు ఎలాంటి తప్పుడు పని చేసినా కొమ్ముకాసే నైజం అనంత బాబును మన్యంలో బలమైన శక్తిగా మార్చిందన్నది కాదనలేని వాస్తవమంటున్నారు.

6 నెలల క్రితం తన కాన్వాయ్‌కు అడొచ్చారని గోకవరం డిపో బస్సు డ్రైవర్‌ని ఆనంతబాబు అనుచరులు కొట్టడంతో రంపచోడవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలు రాజీకి వచ్చి కేసు నుంచి బయటపడ్డారు. ఇటీవల నర్సీపట్నం నుంచి మారేడుమిల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ని తన అనుచరులతో కొట్టించిన సంఘటన వెలుగుచూసింది. దాడిని ఫొటోలు తీసిన ప్రయాణికులను బెదిరించి వాటిని తొలగించారంటే అనంత అక్కడి ప్రజలను ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సొంత పార్టీలో వారే చెబుతున్నారు. అనంతబాబుపై సుమారు 12 కేసులు ఉండేవి. వైకాపా అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ ఎత్తేయించుకున్నట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్టు భూములకు బినామీలను సృష్టించి దొంగ డి-పట్టాలతో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన ఘటనలో అనంతబాబు హస్తం ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇలా దొంగ పట్టాలతో గుబ్బలంపాడులో 3.49 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన వెలుగుచూసింది. అనంతబాబు ప్రధాన అనుచరుడు ఒకరు రైతులకు రుణాల కింద చెల్లించాల్సిన సొమ్ము 25 కోట్ల రూపాయలను బినామీల పేరుతో కాజేశారు. ఈ కేసును అధికార బలంతో సెటిల్మెంటు చేసుకొని బయటపడినట్లు ఆరోపణలున్నాయి.

ఎల్లవరంలో ఎల్లేపల్లి భద్రం అనే వ్యక్తి నుంచి 40 ఎకరాల భూమి కొని, దాని పక్కనున్న కొండ ప్రాంతానికి చెందిన మరో 25 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని పలువురు... అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు చర్యలు తీసుకోలేదు. గొంటువానిపాలెంలో ఓ వ్యక్తికి చెందిన వంద ఎకరాల భూమిలో దౌర్జన్యంగా చేపల చెరువులను తవ్వించి, మద్దిగడ్డ జలాశయం నుంచి రైతులకు వెళ్లాల్సిన సాగునీటిని దౌర్జన్యంగా తన పొలాలకు, చేపల చెరువులకు మళ్లించుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి ఏలేశ్వరం, యర్రవరం సహా పలు ప్రాంతాల్లో విక్రయించే దందాలోనూ అనంత బాబుదే కీలకపాత్ర అని చెబుతుంటారు. ఇటీవల గంజాయి తరలిస్తూ చిక్కిన రంపచోడవరం పంచాయతీ వార్డు సభ్యుడు, వైకాపా నాయకుడు కృష్ణారెడ్డి కార్యకలాపాలకు అనంత బాబు ప్రోత్సాహం ఉందని స్థానికులు అంటున్నారు.

గతంలో అనంత బాబుకు కిషోర్ అనే వ్యక్తి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. 2014లో ఎమ్మెల్యేగా వంతల రాజేశ్వరి గెలిచినా నియోజకవర్గ వ్యవహారాలన్నీ అనంత బాబే చూసుకునేవారు. అతని అక్రమాలను కిషోర్... ఎమ్మెల్యే రాజేశ్వరికి చెప్పేవారు. ఇది తెలిసి అనంత బాబు ఓసారి కిషోర్‌ను అందరి ముందు కొట్టారు. దీంతో రాజేశ్వరిని కిషోరే 2017లో తెలుగుదేశంలో చేర్పించారు. అప్పటి నుంచి అతనిపై అనంతబాబు పగ పెంచుకున్నాడని అనుచరులు చెబుతున్నారు. 2019లో తెలుగుదేశం తరఫున రాజేశ్వరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాక.. ఇక్కడుంటే ప్రమాదమని కిషోర్ ప్రాణరక్షణ కోసం వేరేచోటుకు వెళ్లిపోయాడని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. అటు.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై దౌర్జన్యానికి పాల్పడిన కేసులోనూ అనంతబాబు 20 రోజుల పాటు పరారై... బెయిలు తెచ్చుకున్నాక బయటకు వచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details