"అమ్మా నన్ను క్షమించు... మళ్లీ జన్మంటూ ఉంటే నీ కొడుకుగానే పుట్టాలి... నాకు బతకాలని లేదు... నా చావుకు ఎవరూ కారణం కాదు... నీ ఆరోగ్యం జాగ్రత్త... నేను నాన్న దగ్గరికి వెళ్లిపోతున్నాను.." అంటూ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చూసి.. మనస్తాపం చెందిన ఓ యువకుడి ఆఖరి రాత ఇది. ఉద్యోగం రాలేదని ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు (youth commits suicide in nalgonda ).
నల్గొండ జిల్లా (nalgonda) చందంపేట మండలం గువ్వలగుట్టకు చెందిన సపావట్ బూర, కమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు. వారిలో నాలుగో సంతానం నరేశ్(30) చిన్నప్పటి నుంచీ చదువులో ముందుండేవాడు. ఎప్పటికైనా సర్కారు కొలువు సాధిస్తానని చెప్పడంతో... కుటుంబ సభ్యులు కూడా కష్టపడి పీజీ వరకు చదివించారు. అయిదేళ్ల క్రితం నరేశ్ తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు.
తండ్రి పోయిన తర్వాత నరేశ్ ఉద్యోగ వేటలో పడ్డాడు. హైదరాబాద్ వచ్చేసి పోటీపరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలకాకపోవడంతో... ఇక్కడే ఉండిపోయాడు. కుటుంబ సభ్యులు పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి... తనకు ఉద్యోగం వస్తేగాని పెళ్లిచేసుకోనని చెప్పడంతో.. తన ఇద్దరి తమ్ముళ్లకు వివాహం జరిపించారు.