రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. ఆమెను పెదనాన్న, పెద్దమ్మ పెంచి పెద్ద చేశారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే వావివరుసలు మరిచారు. సొంత చిన్నాన్న, పెదనాన్న కొడుకు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాధితురాలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫత్తేపురంలో సోమవారం వెలుగుచూసింది.
కూలీ పనులకు పంపుతూ... వేధింపులు
నేరేడుచర్ల ఎస్సై విజయ్‌ప్రకాశ్, మృతురాలి సోదరి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫత్తేపురానికి చెందిన ఓ యువతి(21)కి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు మరణించారు. వారికి ఇద్దరు కూతుళ్లు కాగా.. ఒకరిని పెదనాన్న, పెద్దమ్మలు పెంచి పెద్ద చేశారు. మరొకరిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. వారు ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. పెద్దమ్మ, పెదనాన్నల వద్ద ఉన్న యువతిని పదో తరగతి వరకు చదివించారు. ఆ తరువాత ఇంటి పనులు, కూలి పనులు చేయిస్తూ వేధిస్తున్నారు.