తన ప్రేమ వివాహానికి సహకరించిన వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని మనస్తాపం చెందిన యువతి... పోలీస్ స్టేషన్ ఎదుట నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగింది. స్థానిక గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న బి.సుజాత దొంతి కుంటలో ఉండేది. వరుసకు బావ అయ్యే పేరాయి గూడెంకి చెందిన వారా కడిమి అలియాస్ జీవరత్నంతో ప్రేమలో పడింది. కొంతకాలంగా సహజీవనం సైతం కొనసాగించింది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న నగదును కూడా జీవరత్నం ఇచ్చేది. ఇలా కొంతకాలం సాగాక జీవరత్నం మొహం చాటేశాడు. అతని కుటుంబ సభ్యుల సహకారంతో వేరే యువతితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సుజాత... జీవరత్నం ఇంటికి వెళ్లి నిలదీయగా అతని తల్లి ఆమెపై దాడి చేసింది. దీంతో ఈ విషయాన్ని దిశా జిల్లా కమిటీ అధ్యక్షురాలు వేముల భారతి, ఆమె భర్త ప్రతాప్ దృష్టికి తీసుకెళ్లగా... వారు ఈనెల 13న అశ్వరావుపేట శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో జీవరత్నంతో వివాహం జరిపించారు.
ఇష్టంలేని పెళ్లి చేశారని దిశా జిల్లా కమిటీ అధ్యక్షురాలు వేముల భారతి ఆమె భర్త ప్రతాప్లపై జీవరత్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించినట్లు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వారిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేయటానికి స్థానిక ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, ఎస్ఐ అరుణ ప్రధాన కారణమని... వారిని ఎదుర్కోలేకే తాను నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సుజాత సూసైడ్ నోట్లో పేర్కొంది.