పెళ్లి గురించి, కాబోయే వాడి గురించి ఆ యువతి కోటి కలలు కన్నది. తానే లోకంగా బతుకుతున్నానని ఆ యువకుడు చెప్పగానే సంబురపడిపోయింది. ఇద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయని భావించి వివాహానికి సన్నాహాలు ప్రారంభించారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో తన ప్రేయసి వేరే యువకుడితో మాట్లాడుతోందని కోపం తెచ్చుకున్నాడు ఆ ప్రియుడు. ఆ కోపంలోనే.. ఆమెతో వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. ఈ విషయంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు షురూ అయ్యాయి. పెళ్లి నిరాకరించడంతో యువతి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సర్దిజెప్పడంతో ఆమెను వివాహమాడేందుకు యువకుడు అంగీకరించాడు.
దారుణం: ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు
10:26 August 20
యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
ఓవైపు ప్రేమించిన అమ్మాయి మరో యువకుడితో మాట్లాడుతోందన్న కోపం... మరోవైపు తన కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ గడప తొక్కేలా చేసిందన్న ద్వేషంతో.. ప్రేయసిపై అతడు పగ పెంచుకున్నాడు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత.. ఏపీలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో ఉన్న యువతి ఇంటికి గురువారం అర్ధరాత్రి వెళ్లాడు. తన వెంట తీసుకొచ్చిన పెట్రోల్‌ను యువతిపై పోసి నిప్పంటించాడు. గమనించిన యువతి అక్క, ఆమె కుమారుడు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ముగ్గుర్ని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. యువకుడు నరవకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలిని పరామర్శించిన మంత్రులు, అధికారులు..
చౌడువాడ బాధితురాలిని ఏపీ మంత్రులు మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శించారు. అలాగే జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ దీపికా పాటిల్ బాధితురాలితో మాట్లాడారు. హత్యాయత్నం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. వారం రోజుల్లో ఛార్జిషీట్ వేస్తామని.. బాధితురాలికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.