నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన మచ్చ శ్రీకాంత్ (22) నిడమనూరు మండలం రేగులగడ్డలో గురువారం తన అమ్మమ్మ దశదిన కర్మకు హాజరయ్యాడు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక అత్త వీరమ్మ, మామ వెంకటయ్యలతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు. దారిలో కొంతమంది దుండగులు సుమో వాహనంలో వచ్చి శ్రీకాంత్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ రహదారిపై పడిపోయారు. అత్తమామలు హఠాత్ పరిణామానికి భయపడి పక్కకు పరిగెత్తారు. శ్రీకాంత్ వరి పొలాల్లోకి పారిపోయే ప్రయత్నం చేశాడు. దుండగులు వెంటపడి శ్రీకాంత్‌ను చుట్టుముట్టి మెడపై వేట కొడవలితో నరికారు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడిక్కడే మరణించాడు.
వెంటపడి కత్తులతో నరికి యువకుడి దారుణ హత్య
వరుసకు తమ్ముడైన యువకుణ్ని పెద్దనాన్న కొడుకే మరో ఐదుగురితో కలిసి వెంటపడి దారుణంగా నరికి హత్య చేశాడు. కుటుంబ కలహాలే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం శివారులో గురువారం చోటుచేసుకుంది. పక్కా ప్రణాళికతో వెంటపడిన నిందితులు శ్రీకాంత్ నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని తమ వాహనంతో ఢీకొట్టి కిందపడ్డాక అతని వెంటపడి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో హాలియా సీఐ వీర రాఘవులు, నిడమనూరు ఎస్‌ఐ కొండల్‌రెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించారు. హత్యకు పాల్పడింది శ్రీకాంత్ సొంత పెద్దమ్మ కొడుకు ఒంగూరి మహేందర్ అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే మహేందర్ మరో అయిదుగురితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడని గుర్తించారు. రెండురోజుల్లో శ్రీకాంత్ తల్లి సంవత్సరీకం జరగనుంది. ఇంతలోనే ఘటన జరగడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుని అక్క వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు తమ వెంట తెచ్చుకున్న కారాన్ని ఘటనాస్థలంలో చల్లి పారిపోయారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకే ఇలా చేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
- ఇదీ చదవండి :వైరస్ మృత్యుఘంటికలు- ఆక్సిజన్ అందక విలవిల