తెలంగాణ

telangana

ETV Bharat / crime

Young Man Murder : 21 రోజుల్లో పెళ్లి.. దారుణంగా చంపేశారు.. అనుమానాలెన్నో?

మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు ఊరి శివారులో శవమై కనిపించాడు. పనిమీద బయటకు వెళ్లిన కుమారుడు ఇంకెప్పుడు తిరిగిరాడని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాబోయేవాడు కానరాలకు వెళ్లాడని తెలిసి ఆ యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ యువకుడి మరణం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

Young Man Murder
Young Man Murder

By

Published : Oct 31, 2021, 2:29 PM IST

మరో 21 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగలో సంచలనం సృష్టించింది. కోహెడ మండలం తంగళ్లపల్లికి చెందిన పైడి రాజశేఖర్‌ (26) సొంతంగా ఉన్న ఆటో, టవేరా వాహనాలు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టుకు అద్దెకు వెళ్తున్నానని కుటుంబీకులకు, మిత్రులకు చెప్పి బయల్దేరాడు. శనివారం తెల్లవారు జామున కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామాల శివారులో హన్మకొండ-సిద్దిపేట మార్గంలో టవేరా వాహనం నిలిపి ఉండగా, అక్కడికి సమీపంలో తీవ్రంగా గాయపడిన స్థితిలో మృతదేహం కనిపించింది. అటుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రాజగోపాలపేట పోలీసులు పరిశీలించారు. వాహనం ఆధారంగా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన పైడి రాజశేఖర్‌గా గుర్తించి వెంటనే ఆ గ్రామ సర్పంచి నాగేశ్వరి ద్వారా కుటుంబీకులకు విషయం తెలియజేశారు. క్ల్లూస్‌ టీం ఆధారాలు సేకరించగా, పంచనామా నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రెండు కుటుంబాల్లో విషాదం..

రాజశేఖర్‌కు పది రోజుల కిందట హుస్నాబాద్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. నవంబరు 6న నిశ్చితార్థం ఉండగా, 21న వివాహం చేయాలని కుటుంబపెద్దలు నిర్ణయించారు. ఈ తరుణంలో దారుణ హత్యకు గురవడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూలపండ్ల కార్యక్రమానికి ఇరు కుటుంబాల సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అతను హత్యకు గురవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కొద్ది రోజుల వ్యవధిలోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు పాడే ఎక్కాల్సి వచ్చిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు విలపించారు.

పలు అనుమానాలు..

రాజశేఖర్‌ శరీరంపై ఉన్న కత్తిపొట్లు, దుస్తులు లేకపోవడం దృష్ట్యా పక్కా ప్రణాళిక ప్రకారమే అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనికి బాధ్యులైన వారే వాహనాన్ని అద్దెకు తీసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. తంగళ్లపల్లి సర్పంచి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు. హతుడి చరవాణి కాల్‌ డేటా ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడితో ఫోన్‌లో చివరిసారిగా ఎవరు మాట్లాడారు, వాహనాన్ని అద్దెకు తీసుకున్నది ఎవరు, తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details