తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెంపదెబ్బ కొట్టాడని నరికేశాడు.. అసలేం జరిగింది..? - hanamkonda district crime news

Murder in Hanamkonda : ‘అయ్యో..! దేవుడా నా కడుపు కాల్చావు. బంగారంలా పెంచుకున్న కొడుకును పొట్టన పెట్టుకున్నారు. దారుణంగా నరికి చంపేశారయ్యా. ఏడాదిన్నర బాబుకు తండ్రిని లేకుండా చేశారు. దూరప్రాంతాన ఉన్న వాడిని పిలిపించి మరీ చంపేశారంటూ’ ఆ తల్లి కంటతడి పెట్టిన తీరు చూపరులను కలచివేసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.

Murder in Hanamkonda
Murder in Hanamkonda

By

Published : Nov 22, 2022, 10:16 AM IST

Murder in Hanamkonda : హనుమకొండకు చెందిన వీరెడ్డి రాహుల్‌రెడ్డి (29) కొత్తగూడెంలో ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో మృతదేహానికి సోమవారం పోలీసులు పోస్టుమార్టం చేయించారు. ఆసుపత్రికి చేరుకున్న మృతుడి తల్లి, కుటుంబ సభ్యుల రోదనలతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జవహర్‌నగర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి వీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలత దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు రాహుల్‌రెడ్డి కొత్తగూడెం గణేశ్‌ బస్తీలోని అద్దె ఇంట్లో ఏడాది కాలంగా ఉంటూ ఒక ప్రైవేటు ల్యాబ్‌లో మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆయనకు మూడేళ్ల క్రితం వింధ్యారాణితో వివాహమైంది. ఏడాదిన్నర బాబు ఉన్నాడు.

హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఉద్యోగావకాశం ఉన్నట్లు తెలిసి 20 రోజుల క్రితం కుటుంబాన్ని అక్కడకు మార్చాడు. శుక్రవారం ఇంటర్వ్యూకి హాజరైన రాహుల్‌రెడ్డి శనివారం ఉద్యోగానికి కూడా హాజరయ్యాడు. భార్య, కుమారుణ్ని హైదరాబాద్‌లోనే ఉంచి.. మిగతా సామగ్రి తీసుకెళ్లేందుకని ఆదివారం ఉదయం కొత్తగూడెం చేరుకున్నాడు. రాత్రి సీఆర్పీ క్యాంపు ఏరియాలో అదే ప్రాంతానికి చెందిన జంజర్ల జానకీరామ్‌ (30) చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. పోస్టుమార్టం అనంతరం బంధువులు మృతదేహాన్ని హనుమకొండకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

పథకం ప్రకారమే హత్య..:రాహుల్‌రెడ్డి మేనేజర్‌గా పనిచేస్తున్న ల్యాబ్‌లో పనిచేస్తున్న ఓ వివాహితను కలిసేందుకు జానకీరామ్‌ తరచూ వెళ్లేవాడు. అతని ప్రవర్తన నచ్చని ఆమె పలుమార్లు ఈ విషయాన్ని రాహుల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయన మందలించి పంపేవాడు. సెప్టెంబరులో కూడా గొడవ చేయడంతో జానకీరామ్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఆయనతో పాటు అతని సోదరుడిపైనా మూడో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఇదంతా మనసులో పెట్టుకున్న జానకీరామ్‌ ఎలాగైనా రాహుల్‌రెడ్డిని చంపాలని కక్ష పెంచుకుని తొలుత తాను మారిపోయానని నమ్మించేందుకు ప్రయత్నించాడు. ల్యాబ్‌లో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని బతిమిలాడాడు. ఇదంతా నిజమేనని నమ్మిన రాహుల్‌రెడ్డి అతని ఫోన్లకు స్పందించసాగాడు.

ఆదివారం హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం వచ్చాక కూడా అతణ్ని కలిశాడు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ద్విచక్రవాహనంపై ఇద్దరూ కలిసి తిరిగారు. 9 గంటల సమయంలో సీఆర్పీ క్యాంపు శివారులో మద్యం తాగారు. కొద్దిసేపటి తర్వాత ముందస్తు పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న తల్వార్‌తో జానకీరామ్‌ రాహుల్‌రెడ్డిని వెంటపడి నరికాడు. మెడ వెనుక భాగం సగం తెగిపోవడంతో అతడు సమీపంలోని ఓ ఇంటి ఆవరణలో కుప్పకూలి చనిపోయాడు. హంతకుడు జానకీరామ్‌ సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు తెలిపారు.

హత్యకు వాడిన తల్వారు, రెండు సెల్‌ఫోన్లు, రక్తం మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఉపాధి నిమిత్తం అతడు కొద్ది రోజులుగా శ్రీరాంపూర్‌లో ఉంటున్నట్లు వెల్లడించారు. రెణ్నెల్ల క్రితం మూడో పట్టణ ఠాణాలో నమోదైన కేసును పోలీసులు తిరగతోడుతున్నారు. వివాదానికి కారణమైన ల్యాబ్‌లో పనిచేసే మహిళను విచారించినట్లు తెలిసింది. హత్యకు కొద్ది నిమిషాల ముందు సంఘటనా స్థలంలో మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, హంతకుడికి వారు సహకరించి ఉండొచ్చనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. మృతుడు రాహుల్‌రెడ్డి నేత్రాలను స్థానిక అగర్వాల్‌ ఐ బ్యాంక్‌ ప్రతినిధులు సేకరించి హైదరాబాద్‌ పంపారు.

ఇవీ చూడండి..:

'పది' పాస్‌ కాలేదు కానీ.. పదేళ్ల నుంచి ‘డాక్టర్‌’గా..!

కొండాపూర్​లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య.. 15 రోజుల క్రితమే ఉద్యోగం

ABOUT THE AUTHOR

...view details