Live Video: షటిల్ ఆడుతూ.. కోర్టులోనే కుప్పకూలిన యువకుడు ! - షటిల్ తాజా వార్తలు
మరణం ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న వారిని కూడా మృత్యుఒడికి చేరుస్తున్నాయి. అప్పటి వరకు ఆడుతూ, పాడుతూ సరదగా గడిపిన వారు కొన్నిసార్లు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అచ్చం అలాంటి ఘటనే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చోటుచేసుకుంది. ఓ యువకుడు స్నేహితులతో కలిసి సరదగా షటిల్ ఆడుతూ.. గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు.
ఆంధ్రప్రదేశ్‌లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఓ యువకుడు షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గేమ్ ఆడుతుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. చిలకలూరిపేట మున్సిపల్ మాజీ ఛైర్మన్, దివంగత మల్లెల బుచ్చయ్య మనవడు కిశోర్.. ఓ ప్రైవేట్ షటిల్ క్లబ్‌లో షటిల్ ఆడుతుండగా ఘటన జరిగింది. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. హఠాత్తుగా గుండెపోటు రావడం, తలలో నరాలు తెగిపోవటం వంటి సందర్భాల్లో ఇలా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. యువకుడి హఠాన్మరణంతో.. అతను ఉంటున్న ప్రాంతంలో విషాదం నెలకొంది.