తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రాణం తీసిన బైక్​ విన్యాసం.. 15 రోజులు మృత్యువుతో పోరాడి మృతి - బీఆర్‌టీఎస్‌ రోడ్డు

Young Boy Died in Bike Stunt: చేతిలో బైక్​ ఉంటే చాలు విన్యాసాలు చేసేందుకు రెడీ అవుతోంది నేటి యువకులు. సోషల్​ మీడియాలో వీడియోలు చూసి ప్రమాదకర విన్యాసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏపీలోని ఉయ్యూరు పట్టణానికి చెందిన యువకుడు ప్రమాదకర రీతిలో బైక్​పై స్టంట్లు చేశాడు. అదుపుతప్పి కిందపడి మృత్యువాత పడ్డాడు.

Young Boy Died in Bike Stunt
బైక్​ విన్యాసాలు

By

Published : Nov 22, 2022, 11:24 AM IST

Young Boy Died in Bike Stunt: ఈ చిత్రాలు చూశారా.. సినిమాలో మాదిరిగా బైక్‌పై విన్యాసాలు చేస్తున్న ఏపీలోని ఉయ్యూరు పట్టణానికి చెందిన గౌరీ సాయికృష్ణ అనే 18 ఏళ్ల యువకుడు విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి పమిడిముక్కల మండలం మంటాడ వద్ద బైక్‌పై విన్యాసాలు చేస్తూ అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు 15 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌరి సాయికృష్ణ పరిస్థితి విషమించటంతో ప్రాణాలు కోల్పోయాడు. పేద కుటుంబం కావటంతో కుటుంబానికి సహాయ పడతాడని అతని తల్లిదండ్రులు భావించారు. చేతికి అందిన కుమారుడు ఇప్పుడు మరణించటంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అయితే గతంలో ఇతను ఇలా విన్యాసాలు చేస్తున్నాడని తెలిసి పోలీసులు.. తల్లిదండ్రులు మందలించారని సమాచారం..

చిన్ని గౌరి సాయికృష్ణ మృతి ఉయ్యూరు పట్టణంలో విషాదాన్ని నింపింది. బైక్‌పై ఈ ఫీట్లు వద్దురా బాబు అని ఎన్నోసార్లు మొత్తుకున్నానని, చివరికి అవే విన్యాసాలు తన కొడుకు ప్రాణాలు తీశాయని తండ్రి చిన్ని నటరాజశేఖర్‌ కంటతడి పెట్టారు. వన సమారాధన వద్ద తల్లిని దించి ఇదిగో వస్తున్నాను.. నువ్వు పదా అని వెళ్లిన కొడుకు శవమై తిరిగి రావడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. ఇలాంటి స్టంట్‌లు, ఫీట్లు వద్దని, తల్లిదండ్రులకు శోకం మిగల్చవద్దని తండ్రి నటరాజశేఖర్‌ సాయికృష్ణ స్నేహితుల్ని వేడుకున్నారు. పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్న యువకులు కన్నీరు పెట్టుకున్నారు.

నిత్యం ఇలా యువత ప్రమాదకర రీతిలో సాహసాలు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. విజయవాడ నగరం చుట్టూ పక్కల ప్రాంతాల్లో యువత ద్విచక్ర వాహనాలపై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారని సమాచారం. జనసంచారం తక్కువగా ఉన్న రహదారులను వీటి కోసం ఎంచుకుంటున్నారు. వివిధ రకాల వేడుకలు పుట్టినరోజు, ఫొటో సూట్​ పేర్లతో రద్దీ లేని బీఆర్‌టీఎస్‌ రోడ్డు, కనకదుర్గ వంతెన, హైటెన్షన్‌ రోడ్డు, బెంజి వంతెన, బ్యారేజి, తదితర ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. జనసంచారం ఉండని అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రాణాంతక విన్యాసాలు చేస్తున్నారు. ఆ సమయంలో అయితే నిఘా పెద్దగా ఉండదనే ధీమానే కారణమని ఆరోపణలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details