గణేశ్ నిమజ్జన ఘర్షణలో యువకుడి మృతి మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో గణేశ్ ఉత్సవాల్లో జరిగిన ఘర్షణ ఓ యువకుడి మృతికి దారి తీసింది. అతడి మరణానికి సర్పంచ్ భర్తే కారణమని భావించిన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్పంచ్ ఇంటి వద్ద యువకుడి అంత్యక్రియలు చేసేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
కొత్త మొల్గర గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రతిష్టించిన గణేశ్ విగ్రహానికి మంగళవారం రోజున నిమజ్జనం నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన ఎరుకలి మహేశ్(23) ఈ ఉత్సవంలో డ్యాన్స్ చేసేందుకు వెళ్లగా.. నిర్వాహకులు అడ్డుకున్నారు. మహేశ్‌ను దూషించడం వల్ల మాటామాటా పెరిగి కొందరు యువకులు అతడిపై దాడి చేశారు. కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలపాలైన మహేశ్ స్పృహ తప్పి పడిపోయాడు. అతణ్ని భూత్పూర్లోని ఏ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రోజు మృతి చెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి తరలించారు.
యువకుడి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కులసంఘం నాయకులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి సర్పంచ్ ఇంటి ఎదుట ఖననం చేసేందుకు యత్నించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం వల్ల మహబూబ్‌నగర్ ఆర్డీఓ, డీఎస్పీ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. రెండు పడక గదుల ఇల్లు, ఐదెకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేయగా.. జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని అతడి ఇంటికి తరలించారు.
గ్రామంలో పరిస్థితులు సద్దుమణిగే వరకు పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. అంతకుముందు భాజపా నాయకులు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు ఘర్షణకు కారణమైన కొత్తమొల్గర సర్పంచ్ భర్తతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.