సర్పంచ్ తనను గ్రామస్థుల ఎదుటే కొట్టాడనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లాలో ఆందోళనకు దారితీసింది. అశ్వారావుపేట మండలం నారవారిగూడెంనకు చెందిన ప్రేమ జంట మూడు రోజుల క్రితం గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇందుకు గ్రామానికి చెందిన ఓ ఐదుగురు యువకులు సాయం చేశారనే అనుమానంతో వారిలో ఇద్దరిని.. గ్రామ సర్పంచ్ వెంకట ముత్యం గ్రామస్థుల ఎదుట చితకబాదాడు.
ఇందులో ఇంటర్మీడియట్ చదువుతున్న భవాని శంకర్ అనే యువకుడు మనస్తాపం చెంది.. అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో భవానీ శంకర్ మృతికి కారణమైన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. ఈ మేరకు సర్పంచ్ వెంకట ముత్యంపై కేసు నమోదు చేసినట్లు అశ్వారావుపేట ఎస్సై అరుణ తెలిపారు.