సికింద్రాబాద్.. తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నిహాల్ సింగ్ అనే యువకుడు పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. చివరికి యువతిని పెళ్లి చేసుకోనని ముఖం చాటేయడంతో... బాధిత యువతి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.
లైంగిక వాంఛ తీర్చుకుని పెళ్లికి 'నో' చెప్పాడు..
ప్రేమించానని వెంటపడ్డాడు.. నువ్వే లోకమంటూ ఆమెను మాయ చేశాడు. నువ్వు లేకపోతే బతకలేనంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. అతడి మాయమాటలు నమ్మిన ఆ అమ్మాయి నిజంగానే తనని ప్రేమిస్తున్నాడనుకుంది. అతడు అడగ్గానే శారీరకంగా దగ్గరైంది. అలా పీకల్లోతు ప్రేమలో మునిగిన ఆమె.. ఓసారి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. అప్పుడు అతడిలో తడబాటుతో మోసపోతున్నానని గ్రహించింది. ఇంతలోనే ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఓ సంబంధం కుదిరి నిశ్చితార్థం వరకు వెళ్లింది. అప్పుడు మళ్లీ ఎంట్రీ ఇచ్చిన ప్రియుడు తనతో లైంగికంగా కలవకపోతే వారు సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. భయపడిన ఆ యువతి అతడి కండిషన్‌కు ఒప్పుకుంది. కానీ ఇంతలోనే తాను గర్భవతిననే విషయం తెలిసి అతడిని పెళ్లి చేసుకోమని కోరింది. తానే లోకమంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన ఆ యువకుడు చివరకు ఆ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చాడు. పెళ్లి చేసుకోనని ఆమె ముఖంపైనే తెగేసి చెప్పాడు.
పోలీసుల కథనం ప్రకారం.. అత్తాపూర్ కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన నిహాల్ సింగ్ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమె వెంట పడి ప్రేమలోకి దించాడు. అత్తాపూర్‌లోని చిన్నమ్మ నివాసానికి యువతి వచ్చినప్పుడల్లా ఆమెతో సన్నిహితంగా మెలిగి మాయమాటలతో లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో యువతి అతనితో శారీరకంగా దగ్గరైంది. 2017 నుంచి అనేకసార్లు యువతితో హోటల్లో కలుస్తూ ఉండేవాడు.
పెళ్లి చేసుకోవడానికి నిహాల్‌సింగ్ ముఖం చాటేయడమే కాకుండా యువతికి జరిగిన నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేయించాడు. తన దగ్గరున్న వీడియోలు, ఫొటోలు బయటపెడతానని మరోసారి యువతిని లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి గర్భం దాల్చిన విషయం ఇంట్లో వాళ్లకి తెలిసింది. నిహాల్ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అతడితో పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ నిహాల్ కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించలేదు. ఆమెను పెళ్లికి నిహాల్ ససేమిరా అన్నాడు. ఏం చేయాలో పాలుపోని యువతి తల్లి తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.