ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతితో పాటు ఆమె తల్లి, సోదరిపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కడియం మండలం కడియపులంకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్ మూడు రోజుల క్రితం కడియపులంక గ్రామానికి చెందిన యువతి తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు.
‘‘మీ రెండో కుమార్తెను ప్రేమించాను.. నాతో పెళ్లి చేయాలి. లేదంటే మీ అమ్మాయిని చంపేస్తా’’ అని యువతి తల్లిదండ్రులను హెచ్చరించాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన వెంకటేశ్.. యువతి తలపై సుత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లి, సోదరిపైనా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం వెంకటేశ్ తన గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు.