ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఉద్రిక్తత.. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడి Gudivada YCP workers attacked TDP workers: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ కార్యకర్తలు పలు సేవ కార్యక్రమాలను నిర్వహించారు. టీడీపీ నేత వేనిగండ్ల రాము ఆధ్వర్యంలో పదివేల మందికి అన్న సంతర్పణ, అన్నా క్యాంటీన్ వాహనాలను ప్రారంభం చేశారు. అనంతరం భారీ ఎత్తున వర్ధంతి ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో భాగంగా జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో గుడివాడ పురవీధులు మార్‌మ్రోగాయి.
వేనిగండ్ల రాము, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అయితే, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రావి హాజరుకాకపోవడంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 'ఎన్టీఆర్ ఫ్యాన్స్' పేరుతో అభిమానులు చేపట్టిన బైక్ ర్యాలీని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు అడ్డుకున్నారు.
టీడీపీ కార్యకర్తపై దాడి చేసి హల్‌చల్ చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు చేసిన దాడిలో టీడీపీ కార్యకర్త చెల్లుబోయిన అనిల్ తీవ్రంగా గాయపడ్డారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో బైక్ ర్యాలీని నిర్వహించటంలో తప్పు ఏముందని వైసీపీ నేతలను ప్రశ్నించారు. కావాలనే వైసీపీ నేతలు టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వర్ధంతి కార్యక్రమాలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహించారు.
అనంతరం హారన్లు మోగిస్తూ, జై కొడాలి నాని అంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కొడాలి అనుచరులకు పోలీసులు చెప్పినా వినలేదని, కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతున్న టీడీపీ కార్యకర్త చెల్లుబోయిన అనిల్‌పై నాని అనుచరులు దాడి చేశారని పోలీసులకు తెలియజేశారు. ఓవైపు కంటి పక్కన గాయమై రక్తస్రావం జరుగుతున్నా, పోలీసులు అనిల్‌నే బెదిరించారు. దీంతో నేతలు చేసేదిమీ లేక అనిల్‌ను అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఇవీ చదవండి