తెలంగాణ

telangana

ETV Bharat / crime

women suicide: ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య.. అదే కారణమా.! - ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

నిజామాబాద్​ జిల్లా రూద్రూర్​ మండలం రాణంపల్లిలో విషాదం జరిగింది. భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తరఫు బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

suicide
suicide

By

Published : Aug 2, 2021, 9:34 PM IST

కట్టుకున్న వాడు ఎన్ని చిత్రహింసలు పెట్టినా మౌనంగా భరించింది. పిల్లల ముఖం చూసి.. పుట్టింటి వాళ్ల పరిస్థితి ఎరిగి... కన్నీళ్లను దిగమింగుకుంది. మాటలతో అవమానించినా.. అందినదానితో కొట్టినా అన్నింటినీ తట్టుకుంది. కొన్నాళ్లకు సహనం నశించి.. పుట్టింటికి వెళ్లిపోయింది. తాను దూరమైతేనైనా భర్తలో మార్పు వస్తుందనుకుంది. కొన్నాళ్లకు గ్రామపెద్దల భరోసాతో తిరిగి భర్త ఇంట కాలుమోపింది. భర్త తీరులో ఏమార్పు లేదని ఆరోజే తేలిపోయింది. మెడవంచి తాళి కట్టించుకున్న పాపానికి... అదే మెడకు ఉరితాడు వేసుకుని ఊపిరి తీసుకుంది. భర్త పెట్టే చిత్రహింసలు తాళలేక వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఆయువు తీసిన అనుమానం

నిజామాబాద్​ జిల్లా బీర్కూర్​ మండల కేంద్రానికి చెందిన నీరడి జమునకు రుద్రూర్ మండలం రాణంపల్లికి చెందిన సాయిలుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అప్పటివరకు సాఫీగా సాగిన వారి కుటుంబంలో అనుమానపు బీజాలు వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయి. భార్యపై అనుమానం పెంచుకున్న సాయిలు ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు. చాలాకాలం మౌనంగా భరించిన జమున... వేధింపులు తాళలేక నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.

పెద్దల హామీతో తిరిగి వచ్చి

ఆదివారం నాడు గ్రామ పెద్దలతో కలిసి జమున ఇంటికి వెళ్లిన సాయిలు ఆమెను కాపురానికి రమ్మని కోరాడు. గ్రామపెద్దల హామీపై ఆమె భర్త ఇంట అడుగుపెట్టింది. భర్తలో ఏమార్పు రాలేదని ఇంటికొచ్చిన కొన్ని గంటల్లోనే తేలిపోయింది. ఇంట్లో ఉంచి వెళ్లిన నగలు కనిపించకపోయేసరికి భర్తను నిలదీసింది. కోపంతో ఊగిపోయిన సాయిలు భార్యను చావగొట్టాడు. సోమవారం ఉదయం బ్యాంకులో పెట్టిన నగలు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. మానసికంగాను... శారీరకంగాను చిత్రహింసలు అనుభవించిన జమున.. మనస్తాపంతో ఇద్దరి పిల్లల ఎదుటే ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మా బిడ్డను మీ చేతిలో పెడితే ఇలా చేస్తారా..

గ్రామపెద్దల హామీపై అత్తింటికి పంపితే ఇలా చేస్తారా అంటూ బీర్కూర్​కు చెందిన కొందరు... రాణంపల్లిలో పెద్దలపై దాడికి యత్నించారు. గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలవారిని సముదాయించే ప్రయత్నం చేశారు. తమ బిడ్డను ఆమె భర్తే హత్యచేసి... ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ మృతురాలి తరఫువారు ఆందోళనకు దిగారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్​ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:MURDER: వంద రూపాయల కోసం అన్ననే చంపాడు!

ABOUT THE AUTHOR

...view details