తెలంగాణ

telangana

ETV Bharat / crime

'మీ ఆరోగ్య సూత్రాలు నచ్చాయ్‌.. పెళ్లి చేసుకుందామా?' - సైబర్​ నేర వార్తలు

టిక్​టాక్​, ఇన్​స్టాగ్రామ్​లో ఆ యువకుడు పెట్టిన పోస్టులే ఆమెకు అస్త్రాలయ్యాయి. తాను ఆ పోస్టులతో ఆకర్షితురాలినయ్యానని చెప్పి... ఆ అమాయకున్ని మాయ చేసింది. పెళ్లి చేసుకుందామని ఒప్పించింది. అందినకాడికి నొక్కేసింది. ఆశలు పెంచుకున్న ఆ యువకునికి పంగనామాలు పెట్టి... ఫోన్​ స్విచ్ఛాఫ్​ చేసేసింది.

women done cyber fraud in hyderabad
women done cyber fraud in hyderabad

By

Published : Jan 28, 2021, 7:39 AM IST

‘మీరు చెబుతున్న ఆరోగ్యసూత్రాలు నాకు ఎంతగానో నచ్చాయ్‌.. లక్షల మందికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగింది. మనం పెళ్లి చేసుకుందాం.. మరింత మందికి మేలుచేద్దాం’ అంటూ ఓ సైబర్‌ నేరస్థురాలు హైదరాబాద్‌ యువకుడిని మోసం చేసింది. ఆరునెలల్లో రూ.14 లక్షలు వసూలు చేసుకుంది. పెళ్లి ముహూర్తం నిర్ణయించి.. రెండురోజుల ముందు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసింది. బాధితుడు బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. నిశ్చితార్థం కోసం బంగారు ఉంగరం, హారం కూడా పంపించానని.. దంత వైద్యురాలిగా ఫొటోలు పంపి మోసం చేసిందని వాపోయాడు.

సినిమా రీతి కష్టాలతో వల..

పద్మారావునగర్‌లో ఉంటున్న అర్జున్...‌ ఆరోగ్య రక్షణ, చిట్కాలపై వీడియోలు రూపొందించి టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో రెండేళ్లుగా పోస్ట్‌ చేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో ఓ సైబర్‌ నేరస్థురాలు ఘట్టమనేని వర్ణనా మల్లికార్జున్‌ పేరుతో పరిచయం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేసుకున్న వీరు కొద్దిరోజులకు వాట్సాప్‌, చరవాణిలో సంభాషించుకున్నారు. తన తండ్రి మల్లికార్జున్​, తల్లి నిర్మల శాస్త్రవేత్తలని... తనకు ఏడేళ్ల వయసున్నప్పుడే ప్రమాదంలో చనిపోయారని చెప్పింది. వరుసకు సోదరి అయిన సీతాచౌదరి తనకు, తన సోదరుడు సునీత్‌రాయ్‌ చౌదరికి విద్యాబుద్ధులు నేర్పించినట్లు తెలిపింది. కేరళలోని ఎర్నాకుళం వైద్య కళాశాలలో దంతవైద్యం పూర్తి చేసి విజయవాడలో ఉంటున్నానని చెప్పింది. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లిచేసుకుందాం అంటూ ఫోన్‌లో ప్రతిపాదించగా... అర్జున్‌ అంగీకరించాడు.

సోదరుడికి వైద్యం అంటూ..

అర్జున్‌ పెళ్లికి అంగీకరించగా వర్ణన మోసాలకు తెర తీసింది. తన సోదరుడికి ల్యాప్‌టాప్‌ కావాలని చెప్పింది. గతేడాది మేలో సునీత్‌ అనే వ్యక్తిని పంపడంతో ల్యాప్‌టాప్‌ కొనిచ్చాడు. సెప్టెంబరులో ఫోన్‌ చేసి తన తమ్ముడు కరోనా బారిన పడ్డాడని, కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని, హైదరాబాద్‌ పంపుతున్నట్లు చెప్పింది. సునీత్‌ను కొండాపూర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి అర్జున్​ చికిత్సలు చేయించాడు. రూ.4.60లక్షల బిల్లు చెల్లించాడు. వర్ణన కోసం రూ.1.40లక్షల విలువైన హారాన్ని ఇచ్చాడు. నవంబరులో పెళ్లి చేసుకుందామని, ఖర్చులకు డబ్బుకావాలని వర్ణన అడిగింది. 25 రోజుల్లో రూ.8 లక్షల నగదు, బంగారు ఉంగరాన్ని ఆమెకు పంపించాడు. అనంతరం ఆమెతో పాటు సునీత్‌ ఫోన్లు పనిచేయలేదు. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:సప్లై బాయ్​తో కస్టమర్ ఘర్షణ.. రెస్టారెంట్​లో ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details