ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరిగిన గుంటూరులోని కొత్తపేట పోలీసులకు కేసును బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపేట సీఐ శ్రీనివాసులు తెలిపారు.
ప్రకాశం జిల్లా దర్శి కొత్తపల్లికి చెందిన ఓ మహిళకు అదే ప్రాంతానికి చెందిన రాచకొండ బ్రహ్మయ్య పరిచయం అయ్యాడు. ఆమె డిగ్రీ పూర్తిచేసి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. తనకు తెలిసినవాళ్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ సదరు బాధితురాలిని బ్రహ్మయ్య నమ్మబలికాడు. ఆమెకు మాయమాటలు చెప్పి గుంటూరుకు తీసుకెళ్లి హాస్టల్లో ఉంచాడు. ఈ క్రమంలో జులై 11న ఉద్యోగ విషయం మాట్లాడదామంటూ నగరంలోని విజయశ్రీ లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ కొంతసేపు మాట్లాడిన తరువాత తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. అనంతరం నగ్న వీడియోలు తీశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.