Woman Killed her Nephew: అమ్మతనం విలువ ఏంటో ఆ పిలుపునకు నోచుకోని వాళ్లకు తెలుసు. బిడ్డ నోరారా అమ్మా అని పిలుస్తుంటే అందులో ఉన్న మాధుర్యాన్ని ఏ తల్లయినా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తుంది. అలాంటి అనుభూతి పొందాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. కానీ ఇక్కడ ఆమె ఓ బిడ్డకు తల్లి.. మూడేళ్ల పాటు కుమారుడిని అపురూపంగా పెంచుకుంది. అంతలోనే ఆ బాలుడు గుంతలో పడి మరణించాడు. ఇది జరిగి తొమ్మిదేళ్లవుతోంది. ఇప్పటికీ ఆ బాధను మరిచిపోలేదు. ఈ క్రమంలో లేనిపోని అనుమానాలు పెంచుకుంది. ఆ అనుమానంతో ఏడేళ్ల బాలుడిని బలితీసుకుంది. అసలేం జరిగింది.? ఆ చిన్నారిని ఎందుకు చంపాలనుకుంది.?
తన కుమారుడి మృతికి మరదలే కారణమని రగిలిపోయిన ఆ మహిళ.. మరదలి కుమారుడిని హతమార్చి పగ తీర్చుకుంది. ఆ వివరాలను నిజామాబాద్‌లో సీపీ నాగరాజు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్‌లోని ఆటోనగర్‌కు చెందిన రుక్సానాబేగం, అస్లాంఖాన్‌ల కుమారుడు ఫైజల్‌ఖాన్ తొమ్మిదేళ్ల క్రితం ఓ గుంతలో పడి మరణించాడు. అప్పటికి ఆ బాలుడి వయసు మూడేళ్లు. కుమారుడి మృతికి తన భర్త అస్లాంఖాన్ చెల్లెలు అయిన సనాబేగమే కారణమని రుక్సానా అనుమానం పెంచుకుంది. అందుకు ఎలాగైనా పగతీర్చుకోవాలని నిశ్చయించుకుంది. సమయం కోసం ఎదురూచూసింది.